ప్రచారార్భాటం మీ కోసమే!
ఉచిత బీమా పథకానికి మంగళం
కొందరికే సుఖీభవ
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
తూతూ మంత్రంగా ‘రైతన్నా..మీ కోసం’ కార్యక్రమం
● చంద్రబాబు సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను ప్రశ్నించేందుకు సిద్ధమైన అన్నదాతలు
● నూజెండ్ల మండలం తలార్లపల్లిలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులును నిలదీసిన రైతులు
● ఏ పంటకు గిట్టుబాటు ధర లేదంటూ
ప్రశ్నించిన సొంత పార్టీ కార్యకర్తలు
● మిగిలిన గ్రామాలలోనూ నిలదీస్తారన్న
భయంతో తూతూ మంత్రంగా
ముగించేసిన వైనం
● ఒక్క రైతు సమస్య తీర్చని ప్రభుత్వం
సాక్షి, నరసరావుపేట: అరకొర దిగుబడులు... పండిన పంటలకు గిట్టుబాటు ధర లేదు..దీంతో రైతు పరిస్థితి దయనీయంగా తయారైంది. ప్రభుత్వం ఆదుకుంటుందా అంటే అదీ లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పథకాలను ప్రచారం చేయడం, రైతుల ఫోన్‌లో యాప్ ఇన్‌స్టాల్ చేసేందుకు ‘రైతన్నా..మీ కోసం’ అంటూ ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గత నెల 29న నూజెండ్ల మండలం తలార్లపల్లిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులును రైతులు నిలదీసి తమ ఆవేదనను వెళ్లగక్కారు. సొంతపార్టీకి చెందిన రైతులే ఇలా మాట్లాడటం గమనించిన ప్రజాప్రతినిధులు రైతుల వద్దకు వెళ్లాలంటే ఆలోచనలో పడ్డారు. జిల్లా వ్యాప్తంగా తూతూమంత్రంగా సచివాలయ ఉద్యోగులతో కార్యక్రమాన్ని ముగించారు. అధికార పార్టీకి చెందిన ఒకరిద్దరు రైతుల వద్దకు వెళ్లి ప్లెక్సీ లు పెట్టి ప్రభుత్వం ముద్రించిన కరపత్రాలు ఇచ్చి ఫొటోలు దిగారు. రైతన్నా మీ కోసం విజయవంతమైందని ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చుకోవడం విస్మయం కలిగిస్తోందని రైతులు వ్యాఖ్యానిస్తున్నారు. సమస్యలు తీర్చకపోగా కనీ సం బాధలు వినడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని కర్షకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జిల్లా వ్యాప్తంగా ఏకంగా 2,80,181 మందికి నగదు జమ చేశారు. ప్రస్తు తం అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల సంఖ్య 2.41 లక్షలుగా ఉంది. ఏకంగా 40వేల మంది లబ్ధిదారు ల సంఖ్య తగ్గిపోయింది. అన్నదాత సుఖీభవ పథ కం ద్వారా రైతులకు రూ.20 వేలు అందజేస్తామన్న చంద్రబాబు గెలిచాక గతేడాది పథకం అమలు చేయలేదు. కౌలు రైతులకు సుఖీభవ అందజేస్తా మని హామీ ఇచ్చి అమలు చేయకుండా సుమారు 1.60 లక్షల మంది కౌలు రైతులను మోసం చేశారు.
ఏడాదిన్నారగా వ్యవసాయం తీవ్ర సంక్షోభాలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా మిర్చి, పత్తి, పొగాకు, కంది పంటల రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, మార్కెటింగ్ సౌక ర్యం లేక తీవ్రంగా నష్టపోయారు. రైతులు రోడ్డెక్కి విత్తనాలు, ఎరువులు కావాలని అడిగే దుస్థితి ఏర్పడింది. బస్తా యూరియా కోసం కుస్తీ లు పడాల్సి వచ్చింది. అధికార పార్టీ నేతలు చెప్పిన వారికే ఎరువులు సరఫరా చేసి మిగిలిన వాటిని బ్లాక్ మార్కెట్‌కు తరలించారు.
అష్టకష్టాలు పడి సాగు చేసిన పంటలను ప్రకృతి ప్రకోపాలకు గురై తీవ్రంగా నష్టపోయారు. వారిని ఉదారంగా ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. గత ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా అమలులో ఉండేది. నష్టపోయిన రైతుకు అదే సీజన్‌లో నష్టపరిహారం అందేంది. చంద్రబాబు ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకానికి మంగళం పాడేయడంతో ప్రస్తుతం అందరికి పరిహారం అందడం లేదు. మరోవైపు పండించిన పంటలను అమ్ముకోవడంలో రైతులు నానా కష్టాలు పడుతున్నారు. మిర్చి, పత్తి, పొగాకు రైతుల బాధలు వర్ణనాతీతం. సీసీఐ నిబంధనలతో పత్తి పంటను అమ్ముకోలేక రైతులు తమ పొలాలను దున్నేస్తున్న ఘటనలు చూస్తున్నాం. వరి కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయకపోవడంతో తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు.


