బెంబేలెత్తిస్తున్న స్క్రబ్‌ టైఫస్‌ | - | Sakshi
Sakshi News home page

బెంబేలెత్తిస్తున్న స్క్రబ్‌ టైఫస్‌

Dec 4 2025 7:30 AM | Updated on Dec 4 2025 7:30 AM

బెంబే

బెంబేలెత్తిస్తున్న స్క్రబ్‌ టైఫస్‌

ఆలస్యంగా వెలుగులోకి ...

జ్వరం వస్తే భయాందోళన చెందుతున్న ప్రజలు జిల్లాలో స్క్రబ్‌ టైఫస్‌ పాజిటివ్‌ కేసులు 11 నమోదు స్క్రబ్‌ టైఫస్‌ పురుగు కుట్టిన లక్షణాలతో ఇరువురు మృతి అప్రమత్తంగా ఉండాలంటున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ

స్క్రబ్‌ టైఫస్‌ కీటకం కుట్టిన వెంటనే నొప్పి ఉండదు. మచ్చ, దద్దుర్లు ఏర్పడతాయి. 6 నుంచి 21 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. జ్వరం, చలి, వణుకు, తలనొప్పి, కండరాల నొప్పులు, పొడిదగ్గు, జీర్ణ సమస్యలు ఉంటాయి. ముప్పాళ్ళ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన ఇంటర్‌ విద్యనభ్యసించే విద్యార్థినికి అక్టోబర్‌ 16న జ్వరం రావడంతో మంగళగిరి ఎయిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ నవంబర్‌ 1న మృతి చెందింది. అలాగే రాజుపాలెం ఆర్‌ఆర్‌ సెంటర్‌కు చెందిన యాగసిరి.నాగమ్మ(65) నవంబర్‌లో జ్వరంతో గుంటూరు జీజీహెచ్‌లో చేరింది. 10 రోజుల క్రితం ఆమె మృతి చెందింది. రాజుపాలెం మండలం కొత్తూరుకు చెందిన బట్టు సాలమ్మ జ్వరంతో గుంటూరు జీజీహెచ్‌లో చేరి చికిత్స పొందింది. ఆమె కోలుకుని పది రోజుల క్రితమె ఇంటికి వచ్చింది.

సత్తెనపల్లి: జిల్లా ప్రజలను స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి బెంబేలెత్తిస్తోంది. ఈ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న వారు జిల్లాలో 11 మంది ఉన్నారు. తొలుత సాధారణ జ్వరంగా భావించి అందుబాటులో ఉన్న ఆర్‌ఎంపీ వైద్యులను సంప్రదించినా, తగ్గకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో గుంటూరుకు పరుగులు తీస్తున్నారు. జిల్లాలో ఇరువురు ఈ వ్యాధి లక్షణాలతో మృతి చెందడం కలకలం రేపుతోంది.

స్క్రబ్‌ టైఫస్‌ అంటే..

పచ్చని పొదల్లో దాగి ఉన్న సూక్ష్మ కీటకం స్క్రబ్‌ టైఫస్‌. నల్ల జాతికి చెందిన ‘ట్రాంబికులిడ్‌ మైట్స్‌’ అనే కంటికి కనిపించని సూక్ష్మ కీటకాలు కుట్టడం ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. ఇది కుట్టినప్పుడు ‘ఓరియాంటియా సుత్సుగముషి’ అనే బ్యాక్టీరియా మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆగస్టు – ఫిబ్రవరి మధ్యకాలంలో వీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. పంట పొలాలు, పార్కులు లేదా చెట్ల పొదల్లో పని చేసేవారు కాళ్లకు, చేతులకు పూర్తిగా దుస్తులు ధరించాలి. ఇంటి పరిసరాల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ లేదా యాంటీ–ఇన్సెక్టిసైడ్స్‌ స్ప్రే చేయాలి. పిల్లలు పార్కులు లేదా మైదానాల్లో ఆడుకునేటప్పుడు కీటకాలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

జిల్లాలో 11 పాజిటివ్‌ కేసులు

జిల్లాలో స్క్రబ్‌ టైఫస్‌ పాజిటివ్‌ కేసులు 11 ఉన్నట్లు గుంటూరు జీజీహెచ్‌ ద్వారా వచ్చిన సమాచారం. జిల్లాకు చెందిన ఇరువురు మృత్యువాత పడ్డారు. స్క్రబ్‌ టైఫస్‌ లక్షణాలతోనే వారిరువురు మృతి చెందారా లేదా అనేది తెలుసుకునేందుకు కేస్‌ షీట్లు తెప్పిస్తున్నాం.

– డాక్టర్‌ బి రవి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి,

బెంబేలెత్తిస్తున్న స్క్రబ్‌ టైఫస్‌ 1
1/1

బెంబేలెత్తిస్తున్న స్క్రబ్‌ టైఫస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement