‘కృష్ణా’లో కలుషిత నీటి కలకలం
రసాయనాలు కలవటంతో తీవ్ర దుర్వాసన నాలుగు రోజులపాటు ఆ నీరే వినియోగం
ప్రాణాలతో చెలగాటం
దాచేపల్లి: కృష్ణానదిలో రసాయనాలు కలవడం వలన నీరు కలుషితమవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ, ఏలియంపేట, కాట్రపాడు గ్రామాల పరిధిలో కృష్ణానదిలో నీరు తీవ్ర దుర్వాసన వస్తోంది. ఆ కలుషిత నీటినే తాగిన తంగెడ, ఏలియంపేట గ్రామస్తులు భయాందోళనలు చెందుతున్నారు. మూగజీవాలు కూడా తాగటంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. దాదాపుగా ఆరు రోజులు గడిచినా కృష్ణానదిలో నీరు సాధారణ స్థితికి రాలేదు. రసాయనాలు కలపటం వలన నీరు రంగు మారింది. నాలుగు రోజులపాటు తంగెడ గ్రామస్తులకు ఈ నీటినే సరఫరా చేశారు. నదిలో పేరుకుపోయిన కెమికల్ తెట్టును తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కాట్రపాడు గ్రామం సమీపంలో గతంలో తీసిన గుంతల్లో నిల్వ ఉన్న నీరు కూడా రంగు మారినట్లు స్థానికులు చెబుతున్నారు.
నదిలో రసాయనాలు కలిపి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఊరంతా సర్వే చేసి ప్రజల ఆరోగ్య పరిస్థితిపై సమీక్ష చేస్తే పెనుప్రమాదం నుంచి ప్రజలను కాపాడవచ్చు. పరిస్థితి చక్కబడేంత వరకు ప్రభుత్వం నుంచి సురక్షిత తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలి. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేవారిపై చర్యలు తీసుకోవాలి.
– షేక్ సైదా, తంగెడ
‘కృష్ణా’లో కలుషిత నీటి కలకలం


