గురువుల జేబుకు చిల్లు!
మెగా పేరెంట్ టీచర్స్ డేకు నిధులు చాలవంటున్న ఉపాధ్యాయులు పెరిగిన ధరల ప్రకారం నిధులు విడుదల చేయాలని డిమాండ్ రేపు జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో మెగా పీటీఎం 3.0
సత్తెనపల్లి: ఈ నెల 5న ప్రతి పాఠశాలలో మెగా పేరెంట్స్– టీచర్స్ డే (పీటీఎం) 3.0 కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలని చంద్రబాబు ప్రభుత్వం చెబుతుండగా, అరకొర నిధుల కేటాయింపుపై గురువులు పెదవి విరుస్తున్నారు. దీని నిర్వహణకు పరిమితంగా నిధులు కేటాయించి స్కూల్ కాంపోజిట్ గ్రాంట్ నుంచి ఖర్చు పెట్టుకోమని ప్రభుత్వం చెబుతోంది. విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న దీని వెనుక టీడీపీ ప్రభుత్వ ప్రచారం దాగి ఉంది. 30 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు రూ. 900 నిధులు కేటాయిస్తే ఎక్కడ సరిపోతాయని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టి కాకుండా మార్కెట్‌లో ధరలకు అనుగుణంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. నిధుల కోసం దాతల వద్ద చేయి చాచమని పరోక్షంగా చంద్రబాబు సర్కార్ సూచిస్తోందని, గురువుల జేబులకు చిల్లు పడటం ఖాయమంటూ పలువురు మండిపడుతున్నారు.
డబ్బులు లేకుండా పండుగ ఎలా?
ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఈ నెల 5న పీటీఎం 3.0 ను పండుగలా నిర్వహించాలని విద్యాశాఖ అధికారులకు దిశా నిర్దేశం చేసింది. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యా కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించి స్కూలు ప్రగతిని చాటి చెప్పాలని సూచించారు. ప్రతి విద్యార్థి ప్రోగ్రెస్‌ను వారి తల్లిదండ్రులకు తెలియజేయాలన్న ఈ కార్యక్రమానికి విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా చేసుకొని ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని గురువులు, ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుత ధరల ప్రకారం పీటీఎం 3.0 నిర్వహణకు నిధులు చాలవని చెబుతున్నారు.
ఇదీ జిల్లాలో పరిస్థితి...
జిల్లాలో 1,568 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1,40,761 మంది విద్యార్థులు ఉన్నారు. జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు తొమ్మిది ఉన్నాయి. వీటిల్లో ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థులు 992 మంది, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 829 మంది ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పీటీఎం 3.0 నిర్వహణకు జిల్లాకు రూ.38,99,250 నగదును విడుదల చేస్తామని విద్యా శాఖ అధికారులు ప్రకటించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ఎంత కేటాయిస్తారో చెప్పలేదు. ప్రభుత్వం చెప్పిన ప్రకారం పండుగలా చేయాలంటే ఈ నిధులు చాలవని ఉపాధ్యాయులు పెదవి విరుస్తున్నారు.
మెగా పీటీఎం 3.0 సమావేశ నిర్వహణకు నిధులు పెంచాలి. రాజకీయ నాయకుల జోక్యం లేకుండా చూడాలి. ఈ సమావేశ ఫొటోలు, వీడియోలు యాప్‌లలో అప్‌లోడ్ లేకుండా చేసినట్లు అయితే సమావేశం ఉద్దేశం నెరవేరుతుంది.
– మక్కెన శ్రీనివాసరావు,
ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి
పాఠశాల బోధన సమయం చాలా వృథా అవుతోంది. మెగా పీటీఎం సంవత్సరానికి ఒకసారి నిర్వహిస్తే బాగుంటుంది. ప్రతి ఈవెంట్‌ని లీప్ యాప్‌లో అప్‌లోడ్ చేయటం ప్రధానోపాధ్యాయులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.
–బంకా వాసుబాబు,
పీఆర్‌టీయూ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి
గురువుల జేబుకు చిల్లు!
గురువుల జేబుకు చిల్లు!


