ఊరెళ్తున్నారా.. ఇల్లు జాగ్రత్త!
● సెలవులకు ఇంటికి తాళాలు వేసి వెళ్లేవారు ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బు, విలువైన ఆభరణాలు ఉంచి వెళ్లకూడదు.
● ఇళ్ల పరిసర ప్రాంతాల్లో అనుమానంగా సంచరించే వారి గురించి పోలీసులకు వెంటనే సమాచారం అందించాలి.
● తాళం వేసిన ఇళ్ల వద్ద అపరిచిత వ్యక్తులు ఉదయం వేళ తచ్చాడుతున్నట్లు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి
● విలువైన వస్తువులు పక్కింటి వారికి ఇచ్చి నమ్మి మోసపోవద్దు. ఇరుగు పొరుగు వారిని తమ ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పి వెళ్లడం మంచిది.
● వీలైనంత త్వరగా ప్రయాణం ముగించుకొని వచ్చేలా చూసుకోవాలి.
● ఖరీదైన వస్తువులను బ్యాంకు లాకర్‌లో పెట్టుకుంటే
మంచిది.
● పక్కింటి వారి ద్వారా ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి.
● ఇంట్లో కుటుంబ సభ్యులు బయటకు వెళ్లేటప్పుడు ఇంట్లో ఉన్న మహిళలు, వృద్ధుల వద్దకు అపరిచితుల సమాచారం కావాలని వస్తే నమ్మవద్దు. ఏమరపాటుగా ఉండవద్దు.
● సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
● బయటకు వెళ్లేటప్పుడు తాళాలను ఒకటికి రెండుసార్లు సరి చూసుకోవాలి.
● గ్రామాలకు వెళ్లేవారు ఇంట్లో ఏదో ఒక గదిలో లైట్ వేసి ఉంచాలి
● లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టంను వినియోగించుకొని తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు చెక్ పెట్టొచ్చు.
ఏడాదిలో పండగల సమయంలో 30 శాతం దొంగతనాలు అప్రమత్తంగా లేకపోతే ఊడ్చేస్తారు జాగ్రత్తలు పాటించాలంటున్న పోలీసులు
సత్తెనపల్లి: జిల్లాలో దసరా పర్వదినం సందర్భంగా పాఠశాలలు, కళాశాలలకు పది రోజులు సెలవులు వచ్చాయి. ఈ నేపధ్యంలో సెలవులకు ఇంట్లో అందరూ విహార యాత్రలు, బంధువుల ఇళ్లు, స్వస్థలాలు, ఆధ్యాత్మిక ప్రాంతాలు సందర్శించడానికి సిద్ధమవుతారు. ఆ సమయంలో కొందరు ఇంటి భద్రత విషయమై ఆలోచన చేయరు. సాధారణ రోజులతో పోలిస్తే దసరా, సంక్రాంతి, వేసవి సెలవుల్లో చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏడాదిలో జరిగే దొంగతనాల్లో 30 శాతం ఈ సమయాల్లోనే చోటు చేసుకుంటున్నాయని ప్రాథమిక అంచనా. దసరా సెలవుల నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.
పోలీసుల సూచనలు ఇవే..