
రంగస్థలంపై మరో ‘చింతామణి’
ఆకట్టుకున్న ‘వీణా అవార్డ్స్’ ప్రదర్శనలు
తెనాలి: సుదీర్ఘరాగం.. హోరెత్తే సంగీతం.. అర్థం కాని పద్యం... తెలుగువారికే సొంతమైన పద్యనాటకంపై సాధారణ ప్రేక్షకుడి అభిప్రాయం. ఒకప్పుడు పామరులను సైతం ఉర్రూతలూగించిన పద్యనాటకం, రానురాను ఆదరణ కోల్పోతుండటానికి ఇదే కారణం. భాష, భావం అర్థంకాని పద్యగానంపై మక్కువ తగ్గిపోయింది. ఇలాంటి తరుణంలో తెనాలిలో జరుగుతున్న వీణా అవార్డ్స్ నాటకోత్సవాల్లో రెండోరోజైన ఆదివారం ప్రదర్శించిన ‘కస్తూరి తిలకం’ పద్యనాటకం ఆద్యంతం ప్రేక్షకులను కూర్చోబెట్టింది. కల్పిత కథో, చారిత్రక ఆధారాలున్నాయో తెలీదుగాని, బిల్వమంగళుడు, చింతామణి పేర్లతో ప్రధాన పాత్రల చుట్టూ శారదా ప్రసన్న అల్లిన నాటకాన్ని చందాల కేశవదాసు కళారిషత్, మధిర వారు ప్రదర్శించారు. రంగస్థల కళలో ఆరితేరిన డాక్టర్ నిభానుపూడి సుబ్బరాజు దర్శకత్వం వహించారు. పాత్రల మధ్య సంభాషణలు సందర్భోచితంగా వచ్చే పద్యాలు స్పష్టంగా వినిపిస్తూ, హృద్యమైన గానాలాపనతో నాటకం నడిచింది. చాలాకాలానికి ప్రేక్షకులు చక్కటి పద్యనాటకాన్ని ఆస్వాదించారు. ప్రధాన పాత్రల్లో చిలువేరు శాంతయ్య, బి.విజయరాణి నటించారు. ఇతర పాత్రల్లో సరిత, జి.శివకుమారి, ఎన్.సాంబశివారెడ్డి, నిభానుపూడి సుబ్బరాజు నటించారు. సంగీతం సీహెచ్ నాగేశ్వరరావు.
●తదుపరి మిర్యాలగూడ సాంస్కృతిక సమాఖ్య, మిర్యాలగూడవారి ‘బ్రహ్మరథం’ పద్య నాటకాన్ని ప్రదర్శించారు. బ్రహ్మహత్యాపాతకానికి భయపడి ఇంద్రుడు అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఇంద్రపీఠం ఎక్కిన నహుషుడుకు పదవీ వ్యామోహంతో చేసిన అరాచకాలకు శాపానికి గురై, పశ్చాత్తాపానికి లోనైన ఇతివృత్తమిది. సూలూరి శివసుబ్రహ్మణ్యం రచనకు తడికమళ్ల రామచంద్రరావు దర్శకత్వం వహించారు. తదుపరి కళాంజలి, హైదరాబాద్ వారి ‘యాగం’ సాంఘిక నాటకాన్ని ప్రదర్శించారు. శ్రీశైలమూర్తి రచనకు కొల్లా రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. చివరగా హర్ష క్రియేషన్స్, విజయవాడ వారి ‘భువి కోరని భ్రమణం’ సాంఘిక నాటికను ప్రదర్శించారు. ఆచళ్ల ఉమామహేష్ మూలకథకు తాళాబత్తుల వెంకటేశ్వరరావు నాటకీకరించగా, కత్తి శ్యాంప్రసాద్ దర్శకత్వంలో ప్రదర్శించారు. కళల కాణాచి, తెనాలి, ఆర్‌ఎస్‌ఆర్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు.