
సెపక్ తక్రాలో జోత్స్న ప్రతిభ
చెరుకుపల్లి: జాతీయ స్థాయి సెపక్ తక్రా పోటీలకు తుమ్మ వెంకట జోత్స్న ఎంపికై నట్లు ఎంఈఓ పులి లాజర్ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఈ నెల 27, 28 తేదీలలో డాక్టర్ పి. ఆనంద్ మినీ స్టేడియంలో నిర్వహించిన ఏపీ సీనియర్ సెపక్ తకరా చాంపియన్‌షిప్‌లో ప్రతిభ కనబరచి అక్టోబర్‌లో గోవాలో నిర్వహించనున్న జాతీయ స్థాయి సెపక్ తక్రా పోటీలకు ఎంపికై నట్లు వివరించారు. మండలంలోని పొన్నపల్లి గ్రామానికి చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు తుమ్మ శ్రీనివాసరెడ్డి కుమార్తె. క్రీడాకారిణి జోత్స్నను ఉపాధ్యాయులు మాదావత్ సాంబయ్య నాయక్, ఈమని సాంబశివరావు, రమేష్, కిరణ్ అభినందించారు.
దసరా సెలవుల్లో పిల్లలపై నిఘా ఉంచాలి
బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్
బాపట్లటౌన్: దసరా సెలవుల్లో తల్లిదండ్రులు పిల్లల కదలికలపై నిఘా పెట్టాలని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. వర్షాలకు చెరువులు, గుంతలు నిండిపోయి, నదులు, వాగులు, కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్న దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. సెలవుల్లో సరదాగా కాలక్షేపం కోసం పిల్లలు, యువకులు చెరువులు, కాలువలు, వాగులు, నదీ తీరాలు, సముద్రతీరాలకు వెళ్లి ఈతకు దిగే ప్రయత్నాలు చేస్తున్నారని హెచ్చరించారు. ముఖ్యంగా సూర్యలంక, వాడరేవు, రామాపురం వంటి సముద్రతీరాలకు యాత్రికులు భారీగా తరలివస్తున్నారన్నారు. ఆయా ప్రాంతాల్లో పోలీసులతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. యాత్రికులు తప్పనిసరిగా పోలీసు సూచనలు పాటించాలన్నారు. ఎరుపు రంగు జెండాలను దాటి లోతు ప్రాంతాల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లరాదన్నారు.
ఉద్యోగులకు
డీఏ ప్రకటించాలి
బాపట్లటౌన్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం దసరా కానుకగానైనా డీఏ ప్రకటించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు బడుగు శ్రీనివాస్ కోరారు. పట్టణంలోని ఎస్టీయూ జిల్లా కార్యాలయంలో సంఘ సమావేశం ఆదివారం నిర్వహించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ 2024 నుంచి ఇప్పటి వరకు 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. పీఆర్సీ బకాయిలు, డీఏ, సరెండర్ లీవ్ బకాయిలు, పీఎఫ్ లోన్లు, మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్స్ బకాయిలు దాదాపు రూ.25 వేల కోట్లు ఉన్నాయని చెప్పారు. ఆ బకాయిల విడుదలకు ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజు ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలకు పింఛన్లు, వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని అసెంబ్లీ కమిటీ సిఫార్సు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం, వైద్య సదుపాయాలు కల్పించమంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేదని కుంటి సాకులు చెప్పడం సరికాదన్నారు. డీఎస్సీ నియామకాల ద్వారా కొత్త ఉపాధ్యాయులు పాఠశాలలకు వస్తున్నందున ఎంటీఎస్ ఉపాధ్యాయులను ఏకోపాధ్యాయ పాఠశాలలకు సర్దుబాటు చేయాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు.

సెపక్ తక్రాలో జోత్స్న ప్రతిభ