నేడు చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

నేడు చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఎన్నికలు

Sep 29 2025 8:12 AM | Updated on Sep 29 2025 8:12 AM

నేడు చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఎన్నికలు

నేడు చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఎన్నికలు

నగరంపాలెం (గుంటూరు వెస్ట్‌) : ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఐసీసీ) ఎన్నికల పోటీ రసవత్తరంగా మారింది. ఎన్నడూ లేని విధంగా గతేడాది నుంచే ఐసీసీలో ఎన్నికల ప్రక్రియకు కూటమి ప్రభుత్వం తెరలేపింది. దీంతో అధ్యక్ష పదవి కోసం ఇరువర్గాల ప్యానెళ్లు బరిలోకి దిగాయి. నువ్వా–నేనా అనే రీతిలో పోటీ పడుతున్నాయి.

● గతంలో అధ్యక్షునిగా ఆతుకూరి ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వచ్చారు. దాదాపు 34 ఏళ్ల పాటు ఆయన చాంబర్‌ ఆధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. చాలాసార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో ఉన్న రికార్డులను చెరిపేశారు.

● కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోటీ చిచ్చు రేపింది. దీంతో గతేడాది అధ్యక్ష పదవికి టీడీపీ నేతలు ఏల్చూరి వెంకటేశ్వర్లు, రంగా బాలకృష్ణలు పోటీపడ్డారు. చివరకు కూటమి నేతలంతా ఒక్కటై, ఏల్చూరి వెంకటేశ్వర్లకు మద్దతుగా శిబిరాలు నిర్వహించి, అధ్యక్ష బరిలో ఉన్న టీడీపీ నేత బాలకృష్ణను ఓడించారు.

● ఆది నుంచి చాంబర్‌లో చురుగ్గా ఉంటున్న రంగా బాలకృష్ణను విస్మరించి, ఏల్చూరి వెంకటేశ్వర్లు వైపు కూటమి నాయకులు మొగ్గుచూపడం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది.

● ప్రస్తుతం జరిగే ఎన్నికల్లోనూ ఆ ఇద్దరి మధ్యనే మళ్లీ పోటీ నెలకొనడం రసకందాయంగా మారింది. ఈసారైనా గెలుపొందాలని బాలకృష్ణ ప్యానెల్‌ తీవ్రంగా పావులు కదుపుతోంది. అలాగే రెండోసారి కూడా అధ్యక్ష పదవిని కై వసం చేసుకోవాలని ఏల్చూరి వెంకటేశ్వర్లు ప్యానెల్‌ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది.

మళ్లీ ఆ ఇద్దరే అధ్యక్ష పదవికి పోటీ

గుంటూరు నగరంలోని జిన్నాటవర్‌ కూడలిలో ఉన్న ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఐసీసీ) ప్రధాన కార్యాలయంలో సోమవారం ఎన్నికలు జరుగుతాయి. సుమారు 3,200 మంది వ్యాపారులకు సభ్యత్వం ఉన్నట్లు కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. ఉదయం పది గంటలకు మొదలయ్యే ఓటింగ్‌ ప్రక్రియ సాయంత్రం ఐదు గంటలతో ముగియనుంది. అదే రోజు రాత్రి ఓట్ల లెక్కింపు నిర్వహించి గెలుపొందిన అభ్యర్థిని ప్రకటిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement