
ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ తగదు
వెంటనే ఆ ప్రయత్నాలను కూటమి సర్కారు విరమించాలి కలెక్టర్‌కు వైఎస్సార్‌సీపీ జిల్లా లీగల్ సెల్ న్యాయవాదుల వినతి
నరసరావుపేట: గత ప్రభుత్వంలో నిర్మాణాలను ప్రారంభించిన, పూర్తి చేసిన మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయటాన్ని కూటమి ప్రభుత్వం వెంటనే విడనాడాలని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ న్యాయవాదులు కోరారు. ఈ మేరకు శనివారం లీగల్ సెల్ జిల్లా అధ్యక్షురాలు రోళ్ల మాధవి నేతృత్వంలో కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా రోళ్ల మాధవి మీడియాతో మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం పది మెడికల్ కళాశాలలు, దానికి అనుబంధంగా ఉన్న ఆసుపత్రులను పీపీపీ పద్ధతిలో ప్రైవేటుపరం చేయటాన్ని వ్యతిరేకిస్తూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశామన్నారు. ప్రైవేటీకరణ వలన పేద, మధ్యతరగతి వారికి వైద్యం, వైద్యవిద్య అందని ద్రాక్షగా మారుతుందని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నడూలేని విధంగా ఒకేసారి 17 మెడికల్ కళాశాలల నిర్మాణాలను ప్రారంభించిన ఘనత కేవలం నాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. వాటిలో పది కళాశాలలను ప్రైవేటుపరం చేసేందుకు కూటమి ప్రభుత్వం ఆదేశాలిచ్చిందన్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా నిర్ణయం
వినుకొండ నియోజకవర్గ లీగల్‌సెల్ అధ్యక్షులు, న్యాయవాది ఎం.ఎన్.ప్రసాదు మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఎక్కడా లేని విధంగా ప్రైవేటుపరం చేయటాన్ని సామాజిక శాస్త్రవేత్తలుగా పిలవబడే న్యాయవాదులు వ్యతిరేకిస్తున్నారన్నారు. సంక్షేమ రాజ్యాంగాన్ని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రూపొందించారని, ఆ స్ఫూర్తికి విరుద్ధగా విద్య, వైద్యాన్ని ప్రైవేటుపరం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. అధికారంలోకి రాగానే విద్య, వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు.
ప్రైవేటీకరణపై అంత మోజు ఎందుకు?
జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, న్యాయవాది చిట్టా విజయభాస్కరరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వెంటనే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో ప్రజాఉద్యమం ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ప్రైవేటుపై అంత మోజు ఉంటే ముఖ్యమంత్రి పదవిని కూడా ప్రైవేటుపరం చేయాలని సూచించారు. చిలకలూరిపేట, సత్తెనపల్లికి చెందిన న్యాయవాదులు దాసరి చిట్టిబాబు, అంకాళ్ల వెంకటేశ్వర్లు, నరసరావుపేట, చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షులు వై.సీతారామిరెడ్డి, ఆర్.శ్రీనివాసరావు, నరేంద్ర, జిల్లాలోని నరసరావుపేట, మాచర్ల, గురజాల, పెదకూరపాడు, చిలకలూరిపేట, వినుకొండ, సత్తెనపల్లి న్యాయవాదులు పాల్గొన్నారు.