
ప్రత్యేక పీజీఆర్‌ఎస్‌లో నాలుగు అర్జీలు స్వీకరణ
నరసరావుపేట: కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధ్యక్షతన శనివారం ఎస్‌సీ, ఎస్‌టీల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో నాలుగు అర్జీలు స్వీకరించారు. దీనిపై తక్షణమే స్పందించిన జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖలకు ఆయా ఫిర్యాదులను అందజేసి పరిష్కరించవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వెనుకబడిన వర్గాలు వారి సమస్యలకోసం ప్రత్యేకంగా చొరవ తీసుకుని ప్రతి నెల నాలుగో శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. అవసరమైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. అధికారులు కూడా ఎప్పటి అర్జీలను అప్పుడే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ ఏకా మురళి, వివిధ శాఖలకు చెందిన జిల్లా ఉన్నత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.