
తగ్గిన ధరల ప్రకారం మందులు విక్రయించాలి
లేనిపక్షంలో తగిన చర్యలు హెచ్చరించిన జిల్లా డ్రగ్స్ కంట్రోలర్, డీఎంహెచ్‌ఓ
నరసరావుపేట: ఇటీవల తగ్గించిన జీఎస్‌టీ ఫలితాలు సామాన్య వినియోగదారులకు అందేవిధంగా తగ్గిన రేట్ల ప్రకారం మందుల అమ్మకాలు జరపాలని, అలా తగ్గించకుండా విక్రయిస్తే చట్టబద్ధంగా తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్ డి.సునీత హెచ్చరించారు. ఎవరైనా వినియోగదారులు తెలిసీ తెలియక ఏదైనా అడిగితే ఓపిగ్గా సమాధానం చెప్పివారికి తగ్గిన రేట్ల గురించి వివరంగా చెప్పాలని అన్నారు. శనివారం జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలంలో ఔషధ తనిఖీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖల సమన్వయంతో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ గురించి మందుల వర్తకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీనికి హాజరైన జిల్లాలోని నరసరావుపేట, సత్తెనపల్లి, చిలకలూరిపేట, వినుకొండ, పిడుగురాళ్ల పట్టణాల మెడికల్ వ్యాపారులను ఉద్దేశించి అధికారులు మాట్లాడారు. వాల్‌పోస్టర్లు ఆవిష్కరించి ప్రతి మెడికల్ షాప్‌లో వినియోగదారునికి స్పష్టంగా కనపడే విధంగా అతికించాలని ఆదేశించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ రవి మాట్లాడుతూ సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని, ఆ విధంగా మెడికల్ షాప్ యజమానులు సహకరించాలని కోరారు. జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు ఎంవీ వేణుమాధవరావు, పల్నాడు జిల్లా కార్యదర్శి ఆర్.మల్లికార్జునరావు, కోశాధికారి ఎ.కోటేశ్వరరావు, జిల్లాలోని అన్ని పట్టణాల మందుల షాపుల యజమానులు పాల్గొన్నారు.