
సాగర్ కాల్వలో ముగ్గురు విద్యార్థుల గల్లంతు
కారెంపూడి: సాగర్ కుడి కాల్వలో సరదాగా ఈత కొడదామని యత్నించిన ముగ్గురు విద్యార్థుల్లో ఒకరు మునిగి మృతి చెందిన ఘటన స్థానిక వినుకొండ రోడ్డు బ్రిడ్జి సమీపంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ వాసు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సరావుపేటకు చెందిన సయ్యద్ సత్తార్, ఖాదర్ వలి, నాగుల్ మీరాలు పదవ తరగతి చదువుతున్నారు. దసరా సెలవలు కావడంతో సయ్యద్ సత్తార్ ఇద్దరు మిత్రులతో కలసి కారెంపూడిలో ఉంటున్న పెద్దమ్మ జహీరా ఇంటికి వచ్చారు. బట్టలు ఉతికేందుకు వెళ్తున్న పెద్దమ్మ జహీరాతో పాటు వారు కూడా సాగర్ కాల్వ వద్దకు వచ్చారు. ఈత కొడదామని సరదా పడి ముగ్గురు కాల్వలో దిగారు. ప్రవాహ వేగానికి ముగ్గురు మునిగి కొట్టుకుపోతుండగా జహీరా పెద్ద పెట్టున ఏడుస్తూ కేకలు వేయడంతో ఆ సమీపంలో ఉన్న స్థానికులు గమనించి ఇద్దర్ని కాపాడి ఒడ్డుకు చేర్చారు. సయ్యద్ సత్తార్‌ను ఒడ్డుకు చేర్చేసరికే సత్తార్ (15) ప్రాణాలు విడిచాడు, ఒక్కగానొక్క కుమారుడు మృతితో తల్లిదండ్రులు బంధువులు తల్లడిల్లిపోతున్నారు. నర్సరావుపేటకు చెందిన సయ్యద్ రహీమ్ వ్యవసాయదారుడు, ఆయనకు కుమారుడు కుమార్తె ఉన్నారు. కుమారుడు సత్తార్ కారెంపూడిలో ఉన్న తన అక్క దగ్గరకు సెలవుల్లో సరదాగా గడిపేందుకు వచ్చి ఇలా తనువు చాలించడంతో అందరు శోకసంద్రంలో మునిగిపోయారు. గురజాలలో పోస్టుమార్టం అనంతరం సయ్యద్ సత్తార్ మృతదేహాన్ని ఎస్‌ఐ వాసు బంధువులకు అప్పగించారు.
వారిలో ఒకరు మృతి, ఇద్దరిని కాపాడిన స్థానికులు