
సిరివర్షిణీ..శిరసా నమామి
మహాలక్ష్మీదేవిగా దుర్గమ్మ దర్శనానికి బారులు తీరిన భక్తులు పట్టువస్త్రాలు సమర్పించిన గవర్నర్లు, కాణిపాకం దేవస్థానం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ శుక్రవారం శ్రీమహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం పైగా శ్రీమహాలక్ష్మీదేవి అలంకారం కావడంతో తెల్లవారుజామున నుంచే భక్తుల రద్దీ కనిపించింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశాల నుంచి భక్తుల రాక ప్రారంభమైంది. దీంతో ఉదయం నుంచి రాత్రి వరకు క్యూలైన్‌లో రద్దీ కొనసాగుతూనే ఉంది. ఉదయం 6 గంటలకే సర్వ దర్శనం, రూ.100, రూ.300 టికెట్లు క్యూలైన్లలో దేవస్థాన ఘాట్‌రోడ్డులోని టోల్‌గేట్ వరకు చేరింది.
మారిన వీఐపీ టైం స్లాట్ మేరకు శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు, రాత్రి 7 గంటలకు వీఐపీలు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక మిగిలిన సమయంలో అంతరాలయ గేట్లకు ఆలయ అధికారులు తాళాలు వేశా రు. వీఐపీ టైం స్లాట్ మినహా మిగిలిన సమయంలో వచ్చిన వీఐపీలకు బంగారు వాకిలి దర్శనం కల్పించారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ ప్రాంగణానికి వీఐపీలు రాకుండా పోలీసులు, రెవెన్యూ అధికారులు కట్టుదిట్టం చేశారు. ప్రత్యేక కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, చండీయాగంలో పెద్ద ఎత్తున ఉభయదాతలు హాజరయ్యారు. సర్వ దర్శనం క్యూలైన్‌లో అమ్మవారి దర్శనానికి రెండున్నర గంటల సమయం పట్టినట్లు భక్తులు పేర్కొంటున్నారు. రూ.100, రూ.300 టికెట్ క్యూలైన్‌లో సైతం గంటన్నరకు పైగా సమ యం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాణిపాకం దేవస్థానం నుంచి పట్టువస్త్రాలు
దుర్గమ్మకు కాణిపాకం దేవస్థానం నుంచి పట్టువస్త్రాలను సమర్పించారు. శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం ఈవో పెంచల కిషోర్, స్థానాచార్యులు ఫణీంద్రస్వామిలతో పాటు ఎమ్మెల్యే కె.మురళీమోహన్ పట్టువస్త్రాలతో దుర్గగుడికి విచ్చేశారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. ఈవో శీనానాయక్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.
90 వేల మంది దర్శనం..
మహాలక్ష్మీదేవి అలంకారంలో దుర్గమ్మను శుక్రవా రం సాయంత్రం 6 గంటల వరకు సుమారు 90 వేల మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు పేర్కొన్నారు. 5వ రోజు దేవస్థానానికి రూ.28.21లక్షల ఆదాయం సమకూరిందని చెప్పా రు. లడ్డూల ప్రసాదం విక్రయం ద్వారా రూ. 2.86 లక్షలు, ఆరు లడ్డూ బాక్స్ ప్యాక్ విక్రయం ద్వారా రూ. 23.58లక్షలు, ఆర్జిత సేవా, తలనీలాల టికెట్ల విక్రయంద్వారా రూ.1.75 లక్షలకుపైగా ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు. అన్న ప్రసాదాన్ని 23,656 మందికి పంపిణీ చేసినట్లు వివరించారు.
ఉత్సాహం.. ఆనందం..
సాయం సంధ్య వేళ ఆహ్లాదకర వాతావరణంలో ఆది దంపతులైన శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి వార్లకు నిర్వహించిన నగరోత్సవం కనుల పండువగా సాగింది. మల్లేశ్వరస్వామి వారి ఆలయం వద్ద యాగశాలలో ఆదిదంపతులకు ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించి ఊరేగింపును ప్రారంభించారు. మహామండపం నుంచి మేళతాళాలు, మంగళవాయిద్యాలు, భక్తుల కోలాట నృత్యాలు, డప్పు కళాకారులు విన్యాసాలతో నగరోత్సవం ముందుకు సాగింది. అమ్మవారిని దర్శించుకుని కొండ దిగువకు చేరుకున్న భక్తులు ఆదిదంపతుల నగరోత్సవంలో పాల్గొని తరించారు.
శ్రీలలితా త్రిపుర సుందరీదేవి
దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో ఆరో రోజున దుర్గమ్మ శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమివ్వనున్నారు. శ్రీలక్ష్మీదేవి, శ్రీ సరస్వతీదేవి ఇరు వైపులా వింజామరలతో సేవిస్తూ ఉండగా.. చిరు మందహాసంతో వాత్సల్యరూపిణిగా చెరుకుగడను చేతపట్టుకుని దర్శనమిస్తారు.
నేటి అలంకారం

సిరివర్షిణీ..శిరసా నమామి