
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శిగా వీరారెడ్డి నియామకం
నరసరావుపేట: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లాకు చెందిన వి.వీరారెడ్డిని రాష్ట్ర కార్యదర్శిగా (కేంద్ర కార్యాలయం) నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
బాల్య వివాహంలో 14 మందిపై కేసు నమోదు
సత్తెనపల్లి: బాల్యవివాహంలో 14 మందిపై సత్తెనపల్లి పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆగస్టు 3న పట్టణంలోని దోభీఘాట్‌లో బలుసుపాటి గోపి తన సొంత సోదరి కుమార్తె అయిన ఆరేటి అనుఖ్యలకు బాల్య వివాహం జరిగిందని నరసరావుపేట చైల్డ్ వెల్ఫేర్ కేర్ సంస్థకు ఫిర్యాదు వచ్చినట్లు ఈ నెల 23న చైల్డ్ వెల్ఫేర్ కేర్ సంస్థ ప్రతినిధి యర్రసాని ప్రశాంత్‌కుమార్ పట్టణంలోని 4వ సచివాలయ అడ్మిన్ సెక్రటరీ గరికె కల్పనకు తెలియజేశారు. దీనిపై గరికె కల్పన విచారణ జరిపి వాస్తవం అని తేలడంతో ఆమె పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివాహం చేసుకున్న ఇరువురితోపాటు ఇరువురు తల్లిదండ్రులు, బంధువులు, వివాహం జరిపిన పూజారి, కల్యాణ మండపం నిర్వాహకుడు, ఫొటోగ్రాఫర్ ఇలా మొత్తం 14 మందిపై బాల్య వివాహ చట్టం క్రింద పట్టణ ఎస్‌ఐ పవన్ కుమార్ కేసు నమోదు చేశారు.
పీహెచ్‌సీలో వ్యక్తి మృతిపై విచారణ
అచ్చంపేట: స్థానిక పీహెచ్‌సీలో ఈనెల 21న సకాలంలో వైద్యసేవలు అందకపోవడంతో వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. జిల్లా కలెక్టరు ఆదేశాల మేరకు శుక్రవారం అడిషనల్ డీఎంహెచ్ ఒ పద్మావతి విచారణ చేపట్టారు. మృతుడు షేక్ నాగుల్‌మీరా బంధువులను పిలిపించి విచారించారు. నాగుల్‌మీరా సకాలంలో వైద్యం అందకపోవడం వల్ల మృతి చెందాడా, మరే కారణాల వల్ల మృతి చెందాడా అనే విషయాలపై ఆరా తీశారు. తుది నివేదికను తన ఉన్నతాధికారులకు పంపుతామన్నారు. అచ్చంపేటకు చెందిన సామాజిక కార్యకర్త షేక్ కమల్‌సైదా ఆధ్వర్యంలో మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని, పరిహారాన్ని అందించాలని కోరుతూ అడిషనల్ డీఎంహెచ్‌ఓ పద్మావతికి వినతి పత్రం అందజేశారు. పీహెచ్‌సీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని, 108 అత్యవసరం వాహనం ఒక్క అచ్చంపేటకు మాత్రమే పరిమితమవుతుందని, 108 సేవలను మండలం మొత్తానికి విస్తరింపజేయాలని కోరారు.