
ప్రకృతి వ్యవసాయ విధానంతో అధిక దిగుబడులు
జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అమలకుమారి
బెల్లంకొండ: ప్రకృతి వ్యవసాయ విధానంతో రైతులు అధిక దిగుబడులను సాధించవచ్చని ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె.అమలకుమారి తెలిపారు. శుక్రవారం మండలంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను అజయ్ ఇంటెలికాప్ మహారాష్ట్ర ఎన్జీవో బృందం సభ్యులు పరిశీలించారు. మండలంలోని పలు గ్రామాల్లో సాగవుతున్న క్షేత్రాలకు డీపీఎం అమలకుమారి వారిని తీసుకువెళ్లి వివరించారు. రైతులు పండిస్తున్న పలు పంటల సాగు వివరాలు, కషాయాల వినియోగం, బీజామృతం వంటి ప్రకృతి పద్ధతులను వివరించారు. బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్లో ఘన, ద్రవ జీవామృతాల తయారీని పరిశీలించారు. నాగిరెడ్డిపాలెం గ్రామంలో మహిళా రైతు మహాలక్ష్మి ప్రకృతి విధానంలో సాగు చేస్తున్న వరి పొలాన్ని పరిశీలించి, సాధారణ సాగు పొలంలో కంటే ఎక్కువ పిలకలు రావడాన్ని గమనించారు.
మహిళా సంఘాలతో సమావేశమై రైతులు ప్రకృతి వ్యవసాయంలోకి రావడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రైతు సేవ కేంద్రాల్లో పీఎండిఎస్ కిట్లు, పీజీఎస్ సర్టిఫికేషన్, మహిళా సంఘాల పాత్ర, ప్రాముఖ్యతను తెలియజేశారు. చండ్రాజుపాలెంలో మహిళా రైతు రొయ్యల మంగమ్మ పొలంలో ఏటీఎం మోడల్ లను సందర్శించారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.