
అసెంబ్లీ సాక్షిగా జగన్‌కు క్షమాపణ చెప్పాలి
● బాలకృష్ణ వ్యాఖ్యలను తక్షణమే
అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలి
● విలేకర్ల సమావేశంలో వైఎస్సార్ సీపీ
జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు
డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
నరసరావుపేట: అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని, అతను చేసిన వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్టుల నుంచి తొలగించాలని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో డాక్టర్ గోపిరెడ్డి మీడియాతో మాట్లాడారు. జగన్‌ను సైకోగాడని, చిరంజీవిని ఎవడు..నాన్‌సెన్స్ అంటూ గురువారం అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. బాలకృష్ణ మాటలు రాష్ట్ర ప్రజలు అసహ్యించుకునే రీతిలో ఉన్నాయని అన్నారు. అతని మాటలు, నిల్చున్న తీరు, బాడీ లాంగ్యేజ్ గమనిస్తే నిజంగా అసెంబ్లీకి మద్యం తాగి వచ్చాడేమో అనే అనుమానాలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి తక్షణమే స్పందించి బాలకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పీకర్ స్థానంలో ఉండి కూడా ఈ విషయాన్ని ఖండించకపోవటం దారుణమని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ తుపాకీ పేలిన ఘటనలో మేము కూడా రాజకీయాలు చేస్తే బాలకృష్ణ కుటుంబం ఎక్కడ ఉంటుందని అన్నారని, కనీసం ఈ విషయం కూడా అతనికి గుర్తులేకపోవటం బాధాకరమని అన్నారు. కరోనా సమయంలో సినిమా ఇండస్ట్రీ సమస్యలపై వచ్చిన వారందరినీ జగన్‌మోహన్‌రెడ్డి సాదరంగా ఆహ్వానించారని, ఇండస్ట్రీ సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. సినిమా పరిశ్రమను రాష్ట్రానికి తీసుకురావాలని, విశాఖపట్నం లాంటి మహానగరాల్లో కూడా షూటింగ్‌లు నిర్వహించాలని, అవసరమైతే విశాఖపట్నంలో ఫిలిం సిటీ ఏర్పాటు చేసుకొని రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసుకుందామని చెప్పారన్నారు. దీనిపై సినీ హీరోలు చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్‌లు స్పందించి సంతోషం వ్యక్తం చేశారన్నారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ తప్పుడు మాటలు మాట్లాడారని, ఈయన మనిషి బీజేపీలో ఉన్నా మనస్సు మాత్రం ఎప్పుడూ టీడీపీలోనే ఉంటుందన్నారు. బాలకృష్ణ మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు చిరంజీవిని కూడా అవమానకరంగా మాట్లాడారని, దీనిపై జనసేన కార్యకర్తలు ఒక్కసారి ఆలోచన చేయాలని కోరారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి స్పందిస్తూ పలుమార్లు ఫోన్ చేసినా ఆయన అందుబాటులోకి రాలేదని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. తన చొరవ వల్లే వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమా టికెట్ ధరల పెంపునకు జగన్‌మోహన్‌రెడ్డి అంగీకరించారని చిరంజీవి చెప్పిన విషయం మరవరాదన్నారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కందుల శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో శాసనసభ్యులు ఎవరికై నా మెంటల్ సర్టిఫికెట్ ఉందా అంటే, అది కేవలం బాలకృష్ణకేనన్నారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు నందమూరి కుటుంబం మీద ఉన్న గౌరవాన్ని కోల్పోయేలా చేస్తున్నాయని అన్నారు. విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు గుజ్జర్లపూడి ఆకాష్‌కుమార్ మాట్లాడుతూ బాలకృష్ణ క్షమాపణలు చెప్పకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్క వైఎస్సార్‌సీపీ కార్యకర్త అతని ఓటమి కోసం పనిచేస్తారని అన్నారు. రొంపిచర్ల మండలం కన్వీనర్ కురుగుంట్ల శ్రీనివాసరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు పొనుగోటి వెంకటరావు, విద్యార్థి విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పుతోళ్ల వేణుమాధవ్, నరసరావుపేట, చిలకలూరిపేట నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు కోటపాటి మణీంద్రరెడ్డి, ప్రభుదాస్ నాయుడు, నియోజకవర్గ సోషల్‌మీడియా కన్వీనర్ బూదాల కల్యాణ్, మాజీ ఎంపీపీ తన్నీరు శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షులు షేక్ కరీముల్లా, వర్కింగ్ ప్రెసిడెంట్ అచ్చి శివకోటి పాల్గొన్నారు.