
జీఎస్‌టీ సంస్కరణలతో ప్రజలకు మేలు
● దసరా నుంచి దీపావళి వరకు
‘సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్’ ప్రచారం
● జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా
నరసరావుపేట: జీఎస్‌టీ సంస్కరణలతో ప్రజలకు ఎంతో మేలు చేకూరనుందని కలెక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. శుక్రవారం కార్యాలయంలో జీఎస్‌టీ అమలు, అవగాహనపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించా రు. కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన జీఎస్‌టీ సంస్కరణల వల్ల నిత్యావసర సరుకులు, గృహోపకరణాలు, ఔషధాలు, విద్య, స్టేషనరీ ఉత్పత్తులు, వస్త్రాలు, క్రీడా వస్తువులు, రవాణా, హోటల్ రంగాలలో పన్నులు తగ్గుతాయని అన్నారు. వ్యవసాయ ఉపకరణాల ధరలు కూడా గణనీయంగా తగ్గుతాయని పేర్కొన్నారు. దీని వలన కలిగే మేలుపై ప్రజలకు అవగాహన కల్పించడానికి సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా దసరా నుంచి దీపావళి వరకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నామని అన్నారు. జేసీ నోడల్ అధికారిగా, వాణిజ్య పన్నుల శాఖ నోడల్ డిపార్టుమెంట్‌గా వ్యవహ రిస్తుందన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటుచేసి జీఎస్‌టీ సంస్కరణల వలన ఏఏ వస్తువులపై ధరలు తగ్గనున్నాయో వివరించేలా చర్యలు చేపట్టాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో జీఎస్‌టీ సంస్కరణల కారణంగా ప్రజలకు కలిగే మేలును క్షేత్రస్థాయిలో వివరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మున్సిపల్ అతిథి గృహంలో నిర్వహించిన కార్యక్రమంలో జీఎస్‌టీ వేడుకల వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ జాన్ స్టీవెన్‌సన్, వాణిజ్యపన్నులశాఖ అధికారులు రంగయ్య, రామారావు, మున్సిపల్ కమిషనర్ ఎం.జస్వంతరావు పాల్గొన్నారు.