అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతిలో వేంచేసియున్న బాలచాముండికా సమేత అమరేశ్వరాలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్ర మహోత్సవాలలో భాగంగా గురువారం బాలచాముండేశ్వరి అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించారు. ఈ ఉత్సవాలలో నాల్గవ రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో బాలచాముండేశ్వరి అమ్మవారు భక్తుల పూజలందుకున్నారు. అమ్మవారికి సహస్ర కుంకుమార్చన, దేవిఖడ్గమాల, త్రిశల, లలితా సహస్రనామార్చన, శ్రీ చక్రార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ అన్నపూర్ణాదేవి అలంకాల విశిష్టతను వివరిస్తూ లోక పోషకురాలైన అన్నసూర్ణాదేవి రూపంలో బాలాచాముండికాదేవిని దర్శిస్తే కాశీని దర్శించినంత పుణ్యం లభిస్తుందన్నారు. ఆలయంలోని జ్వాలాముఖి, మహిషాసురమర్ధని అమ్మవార్లకు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయం, కోదండ రామస్వామి దేవస్థానాలలో అమ్మవార్లకు ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో దేవాలయాలలో పూజలు నిర్వహించారు.
అలరించిన గాత్ర కచేరి
నగరంపాలెం (గుంటూరు వెస్ట్) : గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై గురువారం గాత్ర కచేరి నిర్వహించారు. నాగార్జున సాంస్కృతిక కేంద్రం, నాగార్జున సంగీత నృత్య పాఠశాల, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సంయుక్తంగా నిర్వహించగా, జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. నాగార్జున స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ కల్చరల్ సెంటర్ చైర్మన్ డాక్టర్ వీజే.వినయకుమార్ అధ్యక్షత వహించారు. టీటీడీ ఆస్థాన గాయకుడు ఎం.రవిచంద్ర పలు గీతాలను అలపించారు. కీబోర్డుపై ఎస్.మురళీ, తబలాపై జీఎం. బాబురావు, రిథమ్స్‌పై ఎం.రెడ్డప్ప, శృతి వాయిద్యాన్ని అందించారు. కార్యక్రమంలో కళాశాల ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.సూర్యనారాయణ, కార్యదర్శి డాక్టర్ ఎం.ఎస్.శ్రీధర్ పాల్గొన్నారు.
రిటర్నబుల్ ప్లాట్లకు నేడు ‘ఈ – లాటరీ‘
తాడికొండ: రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఏపీసీఆర్డీఏ పరిధిలో భూములిచ్చిన పెనుమాక (జరీబు, మెట్ట), మల్కాపురం (ప్రత్యామ్నాయ ప్లాట్లు) గ్రామ రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు కేటాయింపునకు ఈ – లాటరీ నిర్వహించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ లెనిన్ సెంటరులోని ఏపీ సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి లాటరీ తీయనున్నట్లు పేర్కొన్నారు. 56 మంది రైతులకు 104 ప్లాట్లను ఆన్‌న్‌లైన్ ర్యాండమ్ సిస్టం ద్వారా కేటాయిస్తామని వెల్లడించారు. వీటిలో 43 రెసిడెన్షియల్, 41 కమర్షియల్, 20 ప్రత్యామ్నాయ ప్లాట్లు ఉన్నట్లు వివరించారు. ఈ– లాటరీ కార్యక్రమానికి రైతులు హాజరు కావాలని వారు ఒక ప్రకటనలో తెలిపారు.
భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్
తాడేపల్లి రూరల్: తాడేపల్లి కనకదుర్గ వారధిపై గురువారం రాత్రి భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. గుంటూరు – విజయవాడ మార్గంలో భారీగా వాహనాలు రావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. దసరా ఉత్సవాల సందర్భంగా ప్రకాశం బ్యారేజ్ మీదుగా వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో కనకదుర్గ వారధివైపు వాహనాలు భారీగా చేరుకున్నాయి. వారధి నుంచి కుంచనపల్లి బకింగ్‌హామ్ కెనాల్ వరకు జాతీయ రహదారితో పాటు సర్వీస్ రోడ్‌లో సైతం ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది.

అన్నపూర్ణాదేవిగా బాలచాముండేశ్వరిదేవి