
ప్రజలకు స్మార్ట్ టెన్షన్
జిల్లాకు 6,30,347 స్మార్ట్ రేషన్ కార్డులు ఇప్పటి వరకు 4,89,094 మందికి కార్డులు పంపిణీ 1,41,253 మందికి అందని కార్డులు అధికారుల పర్యవేక్షణ లోపం
కార్డులు పంపిణీ చేస్తున్న
అధికార పార్టీ నేతలు
సత్తెనపల్లి: కూటమి ప్రభుత్వం రేషన్ కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్‌తో జారీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులు ఇంకా అందక లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ గందరగోళంగా తయారైంది. అస్తవ్యస్త ముద్రణతో కార్డుదారులు లబోదిబోమంటున్నారు. పురుషులను మహిళలను చేసి.. వారికి కార్డులు ఇస్తున్నారు. దీంతో పేద ప్రజలు రేషన్ కార్డుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కార్డు ఎక్కడ ఉందో తెలియక లబ్ధిదారులు పాట్లు పడుతున్నారు. సెప్టెంబర్ నెల రేషన్ అందజేత పూర్తయినా.. ఇంకా జిల్లాలో 1,43,253 మందికి స్మార్ట్ రేషన్ కార్డులు అందలేదు.
జిల్లాకు 6,30,347 స్మార్ట్ కార్డులు
జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు మొత్తం 6,30,347 స్మార్ట్ రేషన్ కార్డులు రాగా గురువారం నాటికి 4,89,094 మందికి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ పూర్తయింది. 77.59 శాతం మాత్రమే పూర్తి చేశారు. వాస్తవానికి గత నెల 25 నుంచే స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జిల్లాలో ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఇంకా 1,43,253 మంది స్మార్ట్ రేషన్ కార్డుల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ఈ– కేవైసీ, ఇతర సాంకేతిక సమస్యల కారణంతో కోత విధించి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను మంజూరు చేసింది. చాలా వరకు స్మార్ట్ రేషన్ కార్డుల్లో అక్షరదోషాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పేర్లు తప్పులతడకగా ఉన్నాయి. వయసులో తేడాలు, షాప్ నంబర్లు, చిరునామా, ఆడ, మగ, సచివాలయం పేర్లు సైతం తారుమారయ్యాయి. ఇక మంజూరైన కార్డులను గ్రామ,వార్డు, సచివాలయ ఉద్యోగులు రేషన్ డీలర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి కార్డులు పంపిణీ చేసేలా ఆయా క్లస్టర్ల వారీగా మ్యాపింగ్ చేశారు. తొలుత సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు ఎదురవడంతో .. ఆ ప్రభావం మొత్తం పంపిణీపై కనిపిస్తుందని కొందరు సిబ్బంది పేర్కొంటున్నారు.
బిజీగా సచివాలయ సిబ్బంది
స్మార్ట్ రేషన్ కార్డులను సచివాలయాల్లోనే తీసుకోవాలని అధికారులు ముందుగా ప్రకటించడంతో కార్డుదారులు సచివాలయాలకు పరుగులు పెట్టారు. అయితే సచివాలయం సిబ్బంది వివిధ పనుల పేరుతో బిజీబిజీగా ఉంటున్నారు. మరికొన్ని గ్రామ సచివాలయాల్లో వీఆర్వో, రేషన్ డీలర్ వద్ద కొన్ని స్మార్ట్ రేషన్ కార్డులు.. సచివాలయంలో కార్డులన్నీ ఒకచోట పడేసి లబ్ధిదారులను వెతుక్కోవాలని చెబుతున్నారు. ఒకరు కార్డు మరొకరు తీసుకెళ్లిపోతున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇంటికి వెళ్లి చూసుకున్న తర్వాత ఆ కార్డు తమది కాదని మళ్లీ సచివాలయాలకు తీసుకొస్తున్నారు.