
అట్టహాసంగా రాష్ట్రస్థాయి ఆట్యా–పాట్యా క్రీడా పోటీలు
నకరికల్లు: రాష్ట్ర స్థాయి క్రీడాపోటీలకు పల్నాడు జిల్లా నకరికల్లు వేదికై ంది. 12వ రాష్ట్రస్థాయి ఆట్యా– పాట్యా చాంపియన్‌షిప్ క్రీడా పోటీలు నకరికల్లులోని వంగా వెంకటరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పల్నాడు జిల్లా ఆట్యా–పాట్యా అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 540 మంది క్రీడాకారులు పోటీలకు హాజరయ్యారు. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ క్రీడాపోటీలు ప్రారంభించారు. క్రీడా పతాకాన్ని ఎగురవేశారు. క్రీడాజ్యోతిని వెలిగించారు. క్రీడాకారులు మార్చ్‌ఫాస్ట్ నిర్వహించారు. తొలిమ్యాచ్‌ను పల్నాడు–విజయనగరం జిల్లాల మధ్య నిర్వహించారు. రెండురోజులపాటు నిర్వహిస్తున్న పోటీలు తొలిరోజు మధ్యాహ్నం నుంచి రాత్రి ఫ్లడ్‌లైట్ల వెలుగుల్లో కూడా సాగాయి. ఎమ్మెల్యే కన్నా మాట్లాడుతూ క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. క్రీడాకారులకు ఉద్యోగాల్లో రాయితీలు లభిస్తాయన్నారు. క్రీడా మైదానాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. క్రీడాకారులందరూ సానుకూల దృక్పథంతో రాణించాలన్నారు. కార్యక్రమంలో ఆట్యా–పాట్యా అసోసియేషన్ సీఈఓ ఆర్.డి.ప్రసాద్, అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శులు ఆర్.శ్రీచరణ్, సామ్రాజ్యం, వి.రోహిత్ జోయెల్, ఫ్లోర్‌బాల్ ఏపీ అసోసియషన్ కార్యదర్శి జోసఫ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జాలాది శ్రీనివాసరావు, ఫిజికల్ డైరెక్టర్‌లు ఝాన్సీరాణి, చింతా పుల్లయ్య, చినబాబు, వెంకటేశ్వర్లు, ఆంజనేయులు, మణి, మద్దం వెంకటేశ్వర్లు, నాయకులు నాగోతు శౌరయ్య, పీఎంసి చైర్మన్ కాసా మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.