అన్న ప్రసాదిని..అభయ ప్రదాయిని | - | Sakshi
Sakshi News home page

అన్న ప్రసాదిని..అభయ ప్రదాయిని

Sep 25 2025 7:37 AM | Updated on Sep 25 2025 7:37 AM

అన్న

అన్న ప్రసాదిని..అభయ ప్రదాయిని

మూడో రోజూ ఇంద్రకీలాద్రిపై అదే రద్దీ తెల్లవారుజాము నుంచి రాత్రి వరకూ కొనసాగిన వైనం అన్న ప్రసాద స్వీకరణకు భక్తుల బారులు నేడు శ్రీ కాత్యాయనీదేవిగా దుర్గమ్మ దర్శనం

ఇంద్రకీలాద్రిపై నేడు..

గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి అమ్మవారి దర్శనం

ఉదయం ఆరు గంటలకు ప్రత్యేక

ఖడ్గమాలార్చన(ఆరో అంతస్తు)

ఉదయం 7 గంటలకు ప్రత్యేక కుంకుమార్చన(ఆరో అంతస్తు)

ఉదయం 9 గంటలకు ప్రత్యేక చండీయాగం(యాగశాల)

ఉదయం 9 గంటలకు ప్రత్యేక శ్రీచక్రనవార్చన(లక్ష కుంకుమార్చన వేదిక)

సాయంత్రం 5 గంటలకు శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి నగరోత్సవ సేవ

సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి మహా నివేదన, పంచహారతుల సేవ, వేద స్వస్తి

రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో మూడో రోజైన బుధవారం దుర్గమ్మ శ్రీఅన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని శ్రీఅన్నపూర్ణాదేవిగా దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు అమ్మవారికి విశేష అలంకరణ, పూజా కార్యక్రమాలు, బాలభోగం నివేదన అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. సర్వ దర్శనం మూడు క్యూలైన్లలో ఉదయం నుంచి సాయంత్రం వరకు రద్దీ కొనసాగుతూనే ఉంది. సాయంత్రం అమ్మవారి మహా నివేదన, పంచహారతుల తర్వాత భక్తుల రద్దీ మరింత పెరిగింది. కెనాల్‌రోడ్డులోని వినాయకుడి గుడితో పాటు కుమ్మరిపాలెం వైపు క్యూలైన్లు భక్తులతో రద్దీగా కనిపించాయి.

సర్వ దర్శనం క్యూలైన్లలో రద్దీ

బుధవారం తెల్లవారుజాము నుంచి సర్వ దర్శనం క్యూలైన్లలో భక్తుల రద్దీ కొనసాగింది. సాధారణ భక్తులతోపాటు భవానీ దీక్షలు స్వీకరించిన భక్తులు క్యూలైన్‌లో ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. అయితే ఉపవాసంతో ఉండే భవానీలకు ప్రత్యేక ఏర్పాటు చేయకపోవడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటకలకు చెందిన భక్తులు అమ్మవారి దీక్షలను స్వీకరించి దర్శనానికి వచ్చారు. తెల్లవారుజాము నుంచి రాత్రి 11 గంటల వరకు సర్వ దర్శనం క్యూలైన్‌లో రద్దీ ఏకధాటిగా కొనసాగుతూనే ఉంది.

వీఐపీ క్యూలైన్‌లో అనుమతి..

సేవా బృంద సభ్యులు, పోలీసు సిబ్బంది ఎవరైనా వీఐపీ క్యూలైన్‌ ద్వారానే అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఈవో శీనానాయక్‌, ఏడీసీపీ జి.రామకృష్ణ సూచించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని స్కానింగ్‌ పాయింట్‌, మీడియా పాయింట్ల వద్ద పలుమార్లు తనిఖీలు నిర్వహించారు. సిఫార్సులతో అమ్మవారి దర్శనం కోసం నేరుగా వస్తున్న వారిని ఆపి కార్డులు తనిఖీలు చేశారు. దీంతో బుధవారం చిన్న గాలిగోపురం పరిసరాల్లో, సీఎం గేటు వద్ద రద్దీ కొంత అదుపులోకి వచ్చింది.

అన్నదాన భవనంలో తనిఖీలు..

అమ్మవారి అన్నప్రసాదం కోసం తరలివచ్చిన భక్తులతో మహా మండపం ఎదుట నూతనంగా నిర్మించిన అన్నదాన భవనం కిటకిటలాడింది. మరో వైపున అన్న ప్రసాద నాణ్యతలలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ, జాయింట్‌కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియ వేరు వేరుగా తనిఖీలు నిర్వహించారు.

మూడో రోజు ఆదాయం రూ.31.08లక్షలు

దసరా ఉత్సవాలలో మూడో రోజైన బుధవారం దేవస్థానానికి రూ.31.08 లక్షల మేర ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. రూ.300 టికెట్ల విక్రయం ద్వారా రూ.10.56లక్షలు, రూ.100 టికెట్ల విక్రయం ద్వారా రూ.3.46లక్షలు, లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ. 2.98లక్షలు, ఆరు లడ్డూ బాక్స్‌ల విక్రయం ద్వారా రూ.11.89 లక్షలు, ఆర్జిత సేవా టికెట్ల విక్రయం, ఇతర సేవల ద్వారా రూ.2.10 లక్షల మేర ఆదాయం లభించిందని పేర్కొన్నారు. ఇక సాయంత్రం 5 గంటల వరకు 58 వేల మంది భక్తులు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా దర్శించుకున్నారని, అన్నప్రసాదం 22,506 మందికి పంపిణీ చేశామని పేర్కొన్నారు.

చూసిన కనులదే భాగ్యం

శ్రీగంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వార్ల నగరోత్సవం కనుల పండువగా సాగింది. యాగశాల వద్ద పల్లకీపై ఉత్సవ మూర్తులు అధిరోహించారు. ఆలయ అర్చకులు ఉత్సవ మూర్తులకు పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కోలాట నృత్యాల మధ్య నగరోత్సవం ప్రారంభమైంది. సప్తవర్ణాలు కలిగిన పుష్పాలతో అలంకరించిన పల్లకీపై ఆదిదంపతులు ముగ్దమనోహరంగా భక్తులకు దర్శనమిచ్చారు.

మహామండపం, కనకదుర్గనగర్‌, ఘాట్‌రోడ్డు మీదగా ఊరేగింపు ఆలయానికి చేరుకుంది. ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం ఎదుట ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

అన్న ప్రసాదిని..అభయ ప్రదాయిని 1
1/1

అన్న ప్రసాదిని..అభయ ప్రదాయిని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement