
రాష్ట్రపతితో విందుకు జాతీయ స్థాయి అవార్డు గ్రహీత
సత్తెనపల్లికి చెందిన కర్నాటి మురళికి దక్కిన అరుదైన అవకాశం చేనేత రంగంలోని ఇక్కత్ డిజైన్‌లో ప్రతిభకు గుర్తింపు
సత్తెనపల్లి: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో కలిసి విందు చేసే అరుదైన అవకాశం సత్తెనపల్లికి చెందిన జాతీయ స్థాయి అవార్డు గ్రహీత కర్నాటి మురళికి దక్కింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 19 మంది జాతీయ స్థాయి అవార్డు గ్రహీతలతో కలసి ద్రౌపదీ ముర్ముతో విందు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. సత్తెనపల్లికి చెందిన కర్నాటి మురళి చేనేత రంగంలో చూపిన ప్రతిభ ఆయనను జాతీయ స్థాయి అవార్డుకు ఎంపిక చేసింది. ఇక్కత్ డిజైన్ కళను భవిష్యత్ తరాలకు అందించాలని నాలుగున్నర దశాబ్దాలుగా చేనేత డిజైన్లపై కర్నాటి మురళి కృషి చేస్తున్నారు. అమరావతిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో ఇక్కత్ డిజైన్లపై శిక్షణ ఇస్తున్నాడు. ఈ క్రమంలో గత జూలైలో దేశవ్యాప్తంగా 19 మందికి జాతీయ స్థాయి అవార్డులు ప్రకటించగా .. ఆంధ్రప్రదేశ్ నుంచి సత్తెనపల్లికి చెందిన కర్నాటి మురళి జాతీయ ఉత్తమ నేత వృత్తిదారుడి అవార్డుకు ఎంపికయ్యారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా అందుకోవాల్సి ఉంది. ఆమె ఆ రోజు అందుబాటులో లేకపోవడంతో కేంద్ర మంత్రుల చేతుల మీదుగా మురళి అవార్డు అందుకున్నారు. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ఎంపికై న 19 మంది జాతీయ స్థాయి అవార్డు గ్రహీతలతో కలిసి మంగళవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విందు ఆరగించారు. కర్నాటి మురళికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో విందు చేసే అరుదైన అవకాశం లభించింది. అనంతరం కలిసి గ్రూప్ ఫొటో దిగారు. మురళి మాట్లాడుతూ తన తండ్రి సాంబయ్య ద్వారా నేర్చుకున్న చేనేత కళా నైపుణ్యం ద్వారా జాతీయ స్థాయిలో అవార్డు అందుకోవడమే కాక రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో కలిసి విందు చేసే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. మురళిని స్ఫూర్తి విద్యాసంస్థల బాధ్యుడు అబ్బూరి సత్యనారాయణతో పాటు పలువురు ప్రత్యేకంగా అభినందించారు.