
సాగర్ కాలువకు గండి
కారంచేడు: మండలంలోని దగ్గుబాడు సమీపంలో సాగర్ కాలువ కట్ట కోతకు గురైంది. గండి పడిన సమయంలో 130 క్యూసెక్కులు ప్రవహిస్తోంది. గత రెండు, మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వరద నీరు కూడా వచ్చి చేరింది. దీంతో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది. కట్టలు పటిష్టంగా లేకపోవడంతో ఈ ప్రమాదం తలెత్తింది.
50 ఎకరాలు మునక
కాలువలోని నీరు సుమారు 50 ఎకరాల్లోకి చేరింది. ప్రస్తుతం పంటలు ఇంకా సాగు చేయక పోవడంతో ఇటు అధికారులు, అటు రైతులు ఊపిరి పీల్చుకున్నారు. కాలువలను శుభ్రం చేయించి, అవసరమైన మరమ్మతులు చేయించాలని రైతులు కోరుతున్నారు. పర్చూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సాగర్ ఆయకట్టుతోపాటు, కొమ్మమూరు కాలువ ఆయకట్టే ఆధారం. గత ఏడాది సాగర్ కాలువ కట్టల పైన జంగిల్ క్లియరెన్స్ సమయంలో వాటిని పటిష్ట పరచాలని రైతులు డిమాండ్‌చేసినా అధికారులు పట్టించుకోలేదు. ప్రమాదం గురించి ఎన్‌ఎస్‌పీ జేఈ రాజేష్‌ను వివరణ కోరగా, ప్రస్తుతం నీటి ప్రవాహానికి ఓవర్‌ఫ్లో అయిందని, బలహీనంగా ఉన్న కట్ట కోతకు గురైందని వివరణ ఇచ్చారు. వెంటనే చిమ్మిరిబండ లాకుల వద్ద నీటి ప్రవాహం నిలుపుదల చేశా మని తెలిపారు. ప్రవాహం తగ్గిన తరువాత తాత్కాలిక మరమ్మతులు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. వేసవిలో శాశ్వత పరిష్కారం కోసం ప్రతిపాదనలు చేస్తామని వివరించారు.