
సాంకేతికత వినియోగంతో లాభసాటి వ్యవసాయం
జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అమలకుమారి
బెల్లంకొండ: రైతులు సాగులో ప్రకృతి వ్యవసాయ విధానం, సాంకేతికతను వినియోగించడం ద్వారా లాభసాటిగా మార్చుకోవచ్చని ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె.అమలకుమారి అన్నారు. మండలంలోని నాగిరెడ్డిపాలెం గ్రామంలో బుధవారం ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగవుతున్న వరి పంటలను పరిశీలించారు. రైతులు కూలీల కొరతతో మందులు కషాయాల పిచికారీలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం సబ్సిడీ ద్వారా డ్రోన్ పరికరాలను అందుబాటులో తీసుకువచ్చిందని పేర్కొన్నారు. డ్రోన్ల ద్వారా తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో సహజ ద్రావణాలను విస్తృతంగా పిచికారీ చేయవచ్చని తెలిపారు. సబ్సిడీ ద్వారా అందించే డ్రోన్ల వినియోగాన్ని రైతులకు వివరించారు. ఘన, ద్రవ జీవామృతం, దశపరిని కషాయం, నీమాస్త్రం వంటి కషాయాలను కూడా డ్రోన్ల సహాయంతో పిచికారీ చేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎన్‌ఎఫ్‌ఏ సైదయ్య, ఎంటీ అనంతలక్ష్మి, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.