
ట్యాంకులు ఇలా.. ఆరోగ్యం ఎలా..
గుంటూరు నగరంలో శిథిలావస్థలో వాటర్ ట్యాంకులు పై కప్పులు ఊడిపోయి అధ్వానం వాటర్ ట్యాంకుల్లో పక్షుల వ్యర్థాలు వీటి ద్వారానే తాగునీటి సరఫరా ప్రస్తుతం నగరంలో డయేరియా బారిన పడి 80 మంది చికిత్స పొందుతున్న పరిస్థితి
తక్కెళ్లపాడు నుంచి సరఫరా చేయాలి
నెలకోసారి సైతం శుభ్రం చేయని వైనం
నెహ్రూనగర్: గుంటూరు నగరానికి తక్కెళ్లపాడు హెడ్ వాటర్ వర్క్స్ నుంచి నగరంలోని పలు వాటర్ ట్యాంకులకు నీటి సరఫరా అయి అక్కడ నుంచి పైపులు ద్వారా ఇంటింటికి తాగునీటి సరఫరా జరుగుతుంది. అయితే నగరంలో ఉన్న పలు వాటర్ ట్యాంకులు శిథిలావస్థకు చేరడంతోపాటు పై కప్పులు ఊడిపోవడంతో అధ్వానంగా మారాయి. వీటి ద్వారానే తాగునీటి సరఫరా జరుగుతుండటంతో నగర వాసులు అనారోగ్యం బారిన పడుతున్నారు.
శిఽథిలావస్థలో ఏడు ట్యాంకులు..
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 62 వాటర్ ట్యాంకులు ఉన్నాయి (వీటిల్లో 42 ట్యాంకులు నగర పరిధిలో, మిగిలిన విలీన గ్రామాలకు చెందినవి). ఈ 42 వాటర్ ట్యాంకుల్లో ఏడు ప్రాంతాల్లోని 9 వాటర్ ట్యాంకులకు పైకప్పులు ఊడిపోయి అధ్వానంగా మారాయి. బీఆర్ స్టేడియం, నల్లచెరువు, ఏటీ అగ్రహారం, స్తంభాలగరువు, శారదాకాలనీ, వసంతరాయపురం, నెహ్రూనగర్ రిజర్వాయర్లలో ఉన్న వాటర్ ట్యాంకులకు ఉన్న పై కప్పులు సక్రమంగా లేకపోవడంతో వాటిలో పక్షుల వ్యర్థాలు పడుతున్నాయి. ఈ నీటినే అధికారులు నగరంలోని అన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. 2018లో బీఆర్ స్టేడియం పరిధిలోని ఆనంద్‌పేటలో 30కి మందికిపైగా డయేరియా బారిన పడి మృతిచెందిన విషయం తెలిసిందే. అప్పుడు హడావుడిగా పాడైపోయిన వాటర్ ట్యాంకులను కవర్ చేస్తూ మరమ్మతులు చేపట్టారు. కాలక్రమేనా అవి కూడా పాడైపోవడంతో వాటిని పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. తీరా ఇప్పుడు అదే ప్రాంతంలో డయేరియా కేసులు నమోదవుతున్నాయి.
ప్రస్తుతం యాక్టివ్‌గా 80 కేసులు..
గుంటూరు నగర పరిధిలో ఇప్పటివరకు 160 మంది డయేరియా బారిన పడి జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 80 మంది డిశార్జి అవ్వగా..ఇంకా 80మంది చికిత్స పొందుతున్నారు. ఈకోలి బ్యాక్టీరి యా కారణంగా కలరా వ్యాప్తి చెంది 3 కేసులు నమోదవగా.. వారు చికిత్స తీసుకుని డిశార్చి అయ్యారు. ప్రభావిత ప్రాంతాల్లో జిల్లాస్థాయి అధికారులను ఒక్కో వార్డుకు ఒక్కో అధికారిని నియమించారు.
గుంటూరు నగరంలో 7 ప్రాంతాల్లో ఉన్న వాటర్ ట్యాంకులు శిథిలావస్థలో పై కప్పులు ఊడిపోయి ఉన్నాయి. 42 వాటర్ ట్యాంకులు నగర పరిధిలో ఉంటే వీటిల్లో 10 ట్యాంకులను ఇంకా శుభ్రం చేయలేదు. డయేరియా ప్రభావిత ప్రాంతాలకు ఆయా పాడైన వాటర్ ట్యాంకుల నుంచే వాటర్ సప్లయి చేస్తే ప్రయోజనం ఏం ఉండదు. తక్కెళ్లపాడు హెడ్ వాటర్ వర్క్స్ నుంచి ట్యాంకర్ల ద్వారా ప్రభావిత ప్రాంతాల్లో తాగునీరు సరఫరా చేయాలి.
– నారాయణరెడ్డి, గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
గుంటూరు నగరంలో ఉన్న 42 వాటర్ ట్యాంకులను నెలకొక సారి శుభ్రం చేయాల్సి ఉంటుంది. కాని ఇందులో చాలా ట్యాంకులను సకాలంలో శుభ్రం చేయడం లేదని గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేయర్స్ అసోసియేషన్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికి ఇంకా ఈ నెలలో 10 ట్యాంకులను శుభ్రం చేయలేదని వారు చెబుతున్నారు. తాగునీటి సరఫరాపై అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై నగర వాసులు పాలకులు, అధికారుల తీరుపై మండిపడుతున్నారు.

ట్యాంకులు ఇలా.. ఆరోగ్యం ఎలా..

ట్యాంకులు ఇలా.. ఆరోగ్యం ఎలా..