
జాబ్ మేళాకు 138 మంది హాజరు
పిడుగురాళ్ల: పిడుగురాళ్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద పల్నాడు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన జాబ్ మేళాకు 138 మంది హాజరైనట్లు జిల్లా అధికారి తమ్మాజీరావు తెలిపారు. జాబ్ మేళాలో మొత్తం 10 కంపెనీల ప్రతినిధులు హాజరై ఎంపికలు నిర్వహించారని తెలిపారు. 51 మంది ఉద్యోగాలకు ఎంపికై నట్లు ఆయన తెలిపారు.
కార్యక్రమంలో గవర్నమెంట్ కళాశాల ప్రిన్సిపల్ బీపీ కృష్ణారెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సిబ్బంది, జిల్లా ఉద్యోగ కల్పనా అధికారి ఎం.రవీంద్రనాయక్, స్కిల్ హబ్ కో ఆర్డినేటర్ పి.శ్రీకాంత్, వీరాంజనేయులు, రామకృష్ణారెడ్డి, మస్తాన్, జూనియర్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ ఎం వెంకట నర్సయ్య, కంపెనీ హెచ్‌ఆర్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఎయిమ్స్‌లో కలరా రోగులను పరామర్శించిన సీపీఎం నాయకులు
మంగళగిరి: మంగళగిరి – తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ డిమాండ్ చేశారు. బుధవారం నగరంలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న కలరా రోగులను సీపీఎం నాయకులు పరామర్శించారు. అనంతరం నేతాజీ మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాల వలన నీటి కాలుష్యంతో డమేరియా, కలరా బారినపడి అనేకమంది పేదలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి ప్రజలకు అత్యవసర వైద్య సేవలందించాలన్నారు. గ్రామాలు, పట్టణాలలో పారిశుద్ధ్యం మెరుగుపరచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సీపీఎం నాయకులు బి.వెంకటేశ్వర్లు, ఎస్‌ఎస్ చెంగయ్య, ఎస్.గణేష్, షేక్ కాజా తదితరులు పాల్గొన్నారు.