
బాలత్రిపురసుందరిదేవిగా దర్శనమిచ్చిన బాలచాముండేశ్వరీదేవి
అమరావతి: ప్రముఖ శైవ క్షేత్రమైన అమరావతిలో వేంచేసియున్న శ్రీబాలచాముండిక సమేత అమరేశ్వరాలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్ర మహోత్సవాలలో భాగంగా మంగళవారం బాలత్రిపుర సుందరిదేవి అలంకారంలో బాలచాముండేశ్వరి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పూజా కార్యక్రమాలలో భాగంగా చండీ, రుద్రహోమాలు, శ్రీచక్రార్చన నిర్వహించారు. ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ బాలత్రిపురసుందరిదేవి అలంకార విశిష్టతను వివరించారు. ఆలయంలోని జ్వాలాముఖి, మహిషాసురమర్ధని అమ్మవార్లకు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో రెండో రోజు శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి వారాహిదేవి అలంకారం చేసి ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయాలను సందర్శించి పూజలలో పాల్గొన్నారు.
తాడికొండ: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 25వ తేదీన వెలగపూడిలో రాష్ట్ర సచివాలయం సమీపంలో డీఎస్సీ అభ్యర్థులకు ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను మంగళవారం పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్, విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు, జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌లు పరిశీలించారు. ఐఎస్‌డబ్ల్యూ ఎస్పీ ఆరిఫ్ ఆఫీజ్, సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవలు వారి వెంట ఉన్నారు. జిల్లాల నుంచి వచ్చే అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా తగు సూచన బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తాగునీరు, మరుగుదొడ్లు తదితర వసతుల కల్పనకు సంబంధించి అధికారులకు సూచనలు ఇచ్చారు.

బాలత్రిపురసుందరిదేవిగా దర్శనమిచ్చిన బాలచాముండేశ్వరీదేవి

బాలత్రిపురసుందరిదేవిగా దర్శనమిచ్చిన బాలచాముండేశ్వరీదేవి