
లో లెవల్ చప్టా..హై లెవల్ సమస్యలు
●కొద్దిపాటి వర్షానికే చప్టాపై వరద ప్రవాహం
●వరద ఉధృతి సాఫీగా వెళ్లకుండాఅడ్డుకుంటున్న గుర్రపు డెక్క
●వాహనాల రాకపోకలకు అంతరాయం
●తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు
సత్తెనపల్లి: దశాబ్దాల కిందట సత్తెనపల్లి మండలంలోని పలు గ్రామాల్లో రహదారులపై నిర్మించిన లో లెవల్ చప్టాలతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో ఆయా గ్రామాల పరిధిలో ఉన్న వాగులు, వంకలు, పొంగినప్పుడల్లా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. ప్రవాహం తగ్గేవరకు అక్కడ చిక్కుకుపోవాల్సిందే. ఇదీ మండల పరిధిలోని పలు గ్రామాల పరిస్థితి. డివిజన్ కేంద్రమైన సత్తెనపల్లి నుంచి అమరావతికి నిత్యం ఆర్టీసీ బస్సులతోపాటు వాహనాల రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ క్రమంలో కొద్దిపాటి వర్షం కురిసినా నందిగామ వద్దగల లో లెవల్ చప్టా పైనుంచి వరద నీరు ప్రవహిస్తుంది. వాగులో గుర్రపు డెక్క విపరీతంగా పెరిగి ఉండడంతో వరద ఉధృతి సాఫీగా ప్రవహించే అవకాశం లేక చప్టాపైకి చేరి సమీపంలోని గృహలలోకి నీరు చేరుతోంది. దీంతో నందిగామ గ్రామ వాసులతోపాటు సత్తెనపల్లి–అమరావతి మార్గంలోని గ్రామాలకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నిత్యం లో లెవల్ చప్టాపై నుంచి వర్షం నీరు ప్రవహిస్తుండడంతో గంటల తరబడి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రొక్లెయిన్‌తో అడ్డుగా ఉన్న గుర్రపు డెక్క తొలగించటంతో కొద్దిసేపటి తరువాత రాకపోకలు పున:ప్రారంభమయ్యాయి. నందిగామ వద్ద ఉన్న లో లెవల్ చప్టాపై నుంచి వరద పొంగితే ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. దీంతో ఆయా గ్రామాల మధ్య ప్రయాణించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. నందిగామ మెయిన్ రోడ్డులో వెంకటేశ్వరస్వామి గుడి ఎదురు వాగులో గుర్రపు డెక్క పెరిగి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి గుర్రపు డెక్క పూర్తిగా తొలగించటంతోపాటు సత్తెనపల్లి–అమరావతి మార్గంలోని నందిగామలో గల లో లెవల్ చప్టా స్థానంలో నూతనంగా బ్రిడ్జి నిర్మించి ఇబ్బందులను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

లో లెవల్ చప్టా..హై లెవల్ సమస్యలు

లో లెవల్ చప్టా..హై లెవల్ సమస్యలు