
హామీలు వెంటనే అమలుచేయాలి
డీఆర్వోకు వినతిపత్రం అందజేసిన ఏఐవైఎఫ్ నాయకులు
నరసరావుపేట: కూటమి నాయకులు ఎన్నికల సందర్భంగా విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) నాయకులు కోరారు. రాష్ట్ర సమితి పిలుపు మేరకు మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో డీఆర్‌ఓ ఏకా మురళికి వినతిపత్రం సమర్పించారు. జిల్లా నాయకులు కె.మల్లికార్జున్ మాట్లాడుతూ మంత్రి లోకేష్ పాదయాత్ర సందర్భంగా జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి విడుదల చేస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని కోరారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 107–108 జీవో రద్దు చేస్తామని చెప్పి ఏడాదిన్నర గడుస్తున్నా రద్దుచేయకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణకు ఇవ్వడం దారుణమని అన్నారు. వెంటనే ఆ నిర్ణయా న్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. నిరుద్యోగ భృతి రూ.3వేలు ఇచ్చేందుకు అసెంబ్లీ సమావేశాల్లో తీర్మా నం చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అన్నారు. అమరావతి రాజధాని ప్రాంతాన్ని తక్షణమే ఫ్రీజోన్‌గా ప్రకటించి స్థానికంగా, ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసే పరిశ్రమల్లో నిరుద్యోగ యువతకు 70శాతం ఉద్యోగావకాశాలు కల్పించాలని అన్నారు. వలంటరీ వ్యవస్థను కొనసాగించాలని, వారిలో విద్యార్హత ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మీపతి, వెంకటేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.