
కూటమి ద్రోహం.. పేదలకు శాపం
2024 జూన్ నాటికి 90 శాతం పూర్తయిన పిడుగురాళ్ల 100 పడకల ఆసుపత్రి నిర్మాణం ఏడాదిన్నరగా 10 శాతం పనులు చేయలేకపోయిన కూటమి ప్రభుత్వం వైద్య పరికరాలు సరఫరా చేసి ఉంటే అందుబాటులోకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరైన వైద్యం అందక దూర ప్రాంతాలకు వెళ్తున్న పల్నాడు ప్రజలు 60 శాతానికి పైగా పూర్తయిన మెడికల్ కళాశాల భవన నిర్మాణాలు
పల్నాడు ప్రాంతానికి తీవ్ర అన్యాయం
కూటమి ప్రభుత్వం వెనుకబడిన పల్నాడు ప్రాంతానికి, ప్రజలకు మేలు చేయకపోగా ద్రోహం తలపెట్టింది. సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందక పేదలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది గమనించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మెడికల్ కళాశాలను, ఆస్పత్రి మంజూరు చేశారు. రూ.217 కోట్లు ఖర్చు చేసి భవనాలు నిర్మించారు. మిగిలిన పనులు పూర్తిచేస్తే పల్నాడు ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి వస్తుంది. కానీ కూటమి ప్రభుత్వం పనులు పూర్తిచేయకపోగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు సిద్ధమైంది. దీంతో పల్నాడు ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందని ద్రాక్షగా మారనుంది.
సాక్షి, నరసరావుపేట: పల్నాడు ప్రాంతానికి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులో లేకపోవడంతో సరైన సమయంలో మెరుగైన వైద్యం అందక ఎంతో మంది అర్థాంతరంగా తనువుచాలిస్తున్నారు. జిల్లాలో కీలకమైన కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్‌ప్రెస్ హైవేలో దాచేపల్లి, పిడుగురాళ్ల వద్ద ప్రమాదం జరిగినా, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మాచర్ల చుట్టుపక్కల కొత్తగా వచ్చిన హైవేలలో జరగరాని ప్రమాదం జరిగితే సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం గుంటూరు, విజయవాడ లాంటి నగరాలకు వెళ్లాల్సి వస్తోంది. అక్కడికి వెళ్లేలోగా ఎన్నో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. మరోవైపు మాచర్ల, గురజాల, పెదకూరపాడు నియోజకవర్గాలలోని గ్రామీణులకు మెరుగైన ప్రభుత్వ వైద్యం అందుబాటులో లేదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని పల్నాడు ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యంతోపాటు ఈ ప్రాంతానికి మణిహారంగా ఓ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉండాలన్న ఉద్దేశంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పిడుగురాళ్ల శివారులోని బ్రహ్మణపల్లిలో మెడికల్ కళాశాలను మంజూరు చేసి నిర్మాణాలు ప్రారంభించింది. గత ప్రభుత్వ హయాంలో కోవిడ్ లాంటి సమస్యలు ఎదురైనా పనులు ఆగకుండా యుద్ధ ప్రాతిపాదికన సాగాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కక్షతో పిడుగురాళ్ల మెడికల్ కళాశాల పనులు పక్కనపెట్టారు. పనులు చేయకుండా మెడికల్ కళాశాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పన్నంగా ధారాదత్తం చేసే కుట్రలకు తెరదీశారు. ఇందులో భాగంగా సుమారు 90 శాతం పూర్తయిన 100 పడకల ఆసుపత్రి పనులను పూర్తి చేసే అవకాశమున్నా కావాలనే పనులు చేయకుండా ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేశారు.
పరికరాలు సమకూరిస్తే సూపర్ స్పెషాలిటీ వైద్యం
పిడుగురాళ్ల సమీపంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మొదలుపెట్టిన మెడికల్ కళాశాల సుమారు 50 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఇందులో భూమి కొనుగోలుకు అయిన ఖర్చు రూ.14.5 కోట్లు, భవన నిర్మాణాలకు సుమారు రూ.320 కోట్లు కాగా మొత్తం రూ.334.5 కోట్లు ఖర్చు పెడితే భవనాల నిర్మాణాలు పూర్తవుతాయి. ఇందులో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఏకంగా రూ.217.07 కోట్లు ఖర్చు చేశారు. అంటే ఇది పూర్తి వ్యయంలో 66 శాతం పూర్తిచేసినట్టు. ఇక మిగిలింది 34 శాతం పనులు మాత్రమే. భవన నిర్మాణాలలో మెడికల్ కళాశాల, 100 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రెండు గా విభజించారు. ఇందులో 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులు గత ప్రభుత్వ హయాంలో సుమారు 90 శాతం, మెడికల్ కళాశాల పనులు 60 శాతం పూర్తి అయ్యాయి. కూటమి ప్రభుత్వం ఏడాదిన్నార పాలనలో 10 శాతం పనులు పూర్తి చేసి ఉంటే అద్భుతమైన 100 పడకల ఆసుపత్రి అందుబాటులోకి వచ్చేది. ఆసుపత్రికి అవసరమైన పరికరాలు కొనుగోలు చేసి ఉంటే ఈపాటికే పల్నాడు జిల్లా వాసులకు ఎంతో కీలకమైన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చి ఎన్నో ప్రాణాలు నిలిచేవి. మెడికల్ కళాశాల నిబంధనల ప్రకారం వైద్య విద్య ప్రారంభానికి కనీసం ఆరు నెలల ముందు ఆసుపత్రిలో ఓపీ సేవలు ప్రారంభం కావాలి. పిడుగురాళ్ల 100 పడకల ఆసుపత్రిలో ఓపీ సేవలు ప్రారంభమై ఉంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏంబీబీఎస్ మొదటి ఏడాది అడ్మిషన్లు పూర్తయ్యి తరగతులు ప్రారంభించే అవకాశముటుంది. అయితే పేదలకు వైద్య విద్య అందుబాటులోకి రావడం ఏమాత్రం ఇష్టం లేని కూటమి ప్రభుత్వం పిడుగురాళ్ల మెడికల్ కళాశాలతోపాటు రాష్ట్రంలోని మరో 16 కాలేజీలను ప్రైవేట్‌పరం చేసేలా అడుగులు వేస్తోంది.
2020–21 14.50
2021–22 37.30
2022–23 86.77
2023–24 55.30
2024 జూన్ వరకు 23.20
మొత్తం 217.07
పిడుగురాళ్ల మెడికల్ కళాశాల పల్నాడు ప్రాంతానికే మణిహారం లాంటిది. గత ప్రభుత్వంలో మేము చిత్తశుద్ధితో పనిచేసి ఆసుపత్రి పనులు 90 శాతం, కళాశాల పనులు సుమారు 60శాతం పూర్తిచేశాం. కూటమి ప్రభుత్వం మిగిలిన 10 శాతం ఆసుపత్రి పనులు పూర్తిచేసి అవసరమైన పరికరాలు ఏర్పాటు చేసి ఉంటే ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వచ్చేది. మెడికల్ కళాశాల ప్రైవేట్‌పరం చేయడమంటే ఈ ప్రాంతానికి చేస్తున్న ద్రోహానికి నిదర్శనం. మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయకుండా పోరాటం చేస్తాం, నిరంతరం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం.
–కాసు మహేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే

కూటమి ద్రోహం.. పేదలకు శాపం

కూటమి ద్రోహం.. పేదలకు శాపం