
నిజమైన రైతుకు యూరియా అందించండి
డిపెప్ స్కూలు కూల్చివేతలపై చర్యలు తీసుకోవాలి
నరసరావుపేట: జిల్లాలో రైతులకు యూరియాను అందించటంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, బ్లాక్ మార్కెట్‌ను అరికట్టి నిజమైన రైతుకు అధికారుల ద్వారా అందజేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి కోరారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు హాజరై కలెక్టర్ కృతికా శుక్లాకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ యూరియా దొరక్క రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సరిపడినంత ఉందని, అందరికీ అందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయు డు చెబుతున్న దానిలో వాస్తవంలేదని అన్నారు. ఒక్కొక్క సొసైటీకి మూడు నాలుగు లారీలు యూరియా తీసుకెళ్లి టీడీపీకి చెందిన రైతులు, వారి బంధువులకు మాత్రమే ఇస్తున్నారే తప్ప, రైతులందరికీ ఇవ్వట్లేదన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా నిజమైన రైతులందరికి పాస్ పుస్తకాల ఆధారంగా ఎకరానికి ఇంత అని నిర్ణయించి ఎన్ని ఎకరాలు ఉంటే అంత యూరియా అందజేయాలని డిమాండ్ చేశారు. బుచ్చిపాపన్నపాలెం సొసైటీ పరిధిలో టీడీపీకి చెందిన రైతులు, వారి బంధువులకు మాత్రమే ఇస్తున్నారని స్పష్టం చేశారు. కొత్తపల్లి, రెడ్డిపాలెం, సంతగుడిపాడు గ్రామాల్లో కూడా యూరియా సంబంధిత రైతులకు ఇవ్వకుండా బ్లాక్‌లో అమ్ముతున్నారన్నారు. ఒక గ్రామానికి చెందిన యూరియా లోడ్ దించితే ఆ గ్రామ రైతులకు ఇవ్వకుండా వేరే గ్రామాలకు చెందిన రైతులకు ఇస్తున్నారన్నారు. ఇలా కాకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇచ్చినా సంతోషమని, అక్కడ కాదంటే గ్రామంలో పంచాయతీ ఆఫీసులోనైనా దించి ఒక ప్రభుత్వ అధికారిని నియమించి, ఆ గ్రామానికి సంబంధించి విలేజి అసిస్టెంట్, వీఆర్‌ఓ, విలేజ్ సెక్రటరీ ద్వారా యూరియాను సరఫరా చేస్తే, నిజమైన రైతులు అందుతుందన్నారు. ఇప్పటికై నా కలెక్టర్ సమీక్ష చేసి అధికారులను పిలిపించుకొని మాట్లాడి అందరికీ యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతు భరోసా కేంద్రానికి వెళ్లి పాస్‌బుక్ చూపిస్తే మారు మాట్లాడకుండా ఎరువులు అందించారని, రైతులు రోడ్డు ఎక్కకుండా పరిపాలన చేశారని గుర్తు చేశారు.
రొంపిచర్ల మండలం బుచ్చిపాపన్నపాలెం గ్రామంలో డిపెప్ స్కూలులో అనధికారికంగా వంటగది, బాత్రూమ్, వంట గది, వాటర్ ట్యాంకు, చెట్టు కూల్చివేసిన ప్రైవేటు వ్యక్తులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్‌కు పేర్లతో సహా వివరిస్తూ అర్జీ అందజేశామని డాక్టర్ గోపిరెడ్డి పేర్కొన్నారు. జిల్లా రైతు విభాగ అధ్యక్షులు అన్నెం పున్నారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పడాల శివారెడి, పట్టణ అధ్యక్షులు షేక్ కరిముల్లా, నాయకులు మూరె రవీంద్రారెడ్డి, పచ్చవ రవీంద్రబాబు, పొనుగోటి వెంకట్రావు, యాంపాటి వెంకటప్పరెడ్డి, పడాల హనుమిరెడ్డి, రంగారెడ్డి, చీమల శ్రీనివాసరెడ్డి, గజ్జల ముసలారెడ్డి, జయమ్మ, రైతు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.