
తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించండి
నరసరావుపేటరూరల్: తల్లిదండ్రుల నుంచి తమకు రక్షణ కల్పించాలని నవ దంపతులు సోమవారం జిల్లా అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) జేవీ సంతోష్‌ను కోరారు. చిలకలూరిపేటకు చెందిన వి.ఆది వెంకట చెన్నకేశవరాజు, షేక్ కమర్ ఇ అజమ్‌లు ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి మతాలు వేరు కావడంతో ఇద్దరి తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించలేదు. నాలుగు నెలల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయి గుడిలో పెళ్లి చేసుకున్నారు. నీకు నచ్చిన విధంగా అందరి సమక్షంలో చెన్నకేశవరాజుతో వివాహం చేస్తామని కమర్ ఇ అజమ్ తల్లిదండ్రులు ఆమెను తీసుకెళ్లారు. ఆ తరువాత చెన్నకేశవరాజుతో మాట్లాడవద్దని అంక్షలు విధించి ఇద్దరిని కలవకుండా చేశారు. దీంతో ఇంటి నుంచి బయటకు వచ్చిన చెన్నకేశవరాజు, కమర్ ఇ అజమ్‌లు సోమవారం ఉదయం చిలకలూరిపేటలోని బాలాజి దేవాలయంలో మరోమారు వివాహం చేసుకున్నారు. పెళ్లికి పెద్దల అంగీకారం లేకపోవడంతో తమకు వారి నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పెళ్లి బట్టలతో జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. పీజీఆర్‌ఎస్‌లో ఎస్పీని కలిసి రక్షణ కల్పించాలని కోరారు. నవదంపతుల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఏర్పాటుచేసి వారి నుంచి ఎలాంటి సమస్యల లేకుండా చూడమని డీఎస్పీ హనుమంతరావును అడిషనల్ ఎస్పీ ఆదేశించారు.