
పీజీఆర్‌ఎస్ ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలి
నరసరావుపేట రూరల్: పీజీఆర్‌ఎస్ ఫిర్యాదులకు ప్రాధాన్యమిచ్చి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషిచేయాలని జిల్లా అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) జేవీ సంతోష్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్ నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ సంతోష్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. 114 అర్జీలు అందాయి
గృహ రుణం పేరుతో రూ.50 లక్షల మోసం
నరసరావుపేటలోని పల్నాడు రోడ్డులో ఎంజే అసోసియేట్స్ పేరుతో అమీర్, మస్తాన్, బాషాలు కార్యాలయం నిర్వహిస్తున్నారు. పట్టణానికి చెందిన ఇనకొల్లు వాసు, జొన్నలగడ్డకు చెందిన సిలివేరి వేమలయ్యతోపాటు వారి నలుగురు స్నేహితులు ఎంజే అసోసియేషట్స్ నిర్వాహకులు చెప్పిన మాయమాటలు నమ్మి రూ.50 లక్షలు చెల్లించారు. గృహ రుణం కోసం వారు పలుమార్లు కోరినా వారి నుంచి స్పందన రావడం లేదు. డబ్బులు అడిగితే చంపుతామని బెదిరిస్తున్నారని బాధితులు అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరారు.
ఆడపిల్లలు పుట్టారని వేధిస్తున్నారు
పిడుగురాళ్ల మండలం గుత్తికొండకు చెందిన షేక్ హవాబికి 12 ఏళ్ల కిందట జానపాడుకు చెందిన బిల్లా సైదాతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఆ తర్వాత వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని హవాబిని బిల్లా సైదా వేధిస్తున్నాడు. దీనికి అత్తమామలు కూడా బిల్లాకు సహకరిస్తున్నారు. పిడుగురాళ్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదు. నాకు, నా బిడ్డలకు న్యాయం చేయాలని హవాబి అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది.
రూ.7 కోట్లు అప్పుగా తీసుకొని పరారయ్యారు
యర్రంశెట్టి హీరో పేరుతో సంస్థను నడుపుతూ నమ్మకంగా తమ వద్ద రూ.7 కోట్లు అప్పుగా తీసుకొని సంస్థ నిర్వాహకుడు యర్రంశెట్టి రాము, బాబ్జిలు పరారయ్యారని నరసరావుపేట సాయినగర్‌కు చెందిన పలువురు ఫిర్యాదు చేశారు. జూలై 31వ తేదీన అప్పులు చెల్లిస్తామని చెప్పి 30వ తేదీ కుటుంబంతో సహా వెళ్లిపోయారని తెలిపారు. తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సత్యనారాయణ, వాసుదేవరావు, ఆంజనేయులు, నాగారాణి తదితరులు అడిషనల్ ఎస్పీని కోరారు.
అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) సంతోష్
జిల్లా ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్
అర్జీలు స్వీకరించిన అడిషనల్ ఎస్పీ