
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
పిడుగురాళ్ల: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన పట్టణంలోని విరాట్ నగర్ సమీపంలో గల విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో ఆదివారం జరిగింది. పట్టణ ఎస్‌ఐ శివనాగరాజు తెలిపిన వివరాల మేరకు... పట్టణంలోని చెరువు కట్ట బజారుకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ చల్లా రాజేష్(22) టిఫిన్ తీసుకొని వచ్చేందుకు ద్విచక్ర వాహనంపై వెళుతున్నాడు. రోడ్డు తడిగా ఉండటంతో ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డుపక్కన పడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కావటంతో రాజేష్ అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. మృతుడు రాజేష్ తల్లి కుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శివనాగరాజు తెలిపారు.