
స్థానిక చిలకలూరిపేట రోడ్డులో 1,503 గృహాలతో నిర్మించిన ట
టిడ్కో నివాస సముదాయంలో వెలగని వీధి దీపాలు ఇళ్ల మధ్య కంప చెట్లతో అడవిని తలపిస్తున్న పరిసరాలు పక్కనే ఉన్న జగనన్న కాలనీలో కూడా మౌలిక వసతులు కరువు
నరసరావుపేట: టిడ్కో గృహాల నిర్మాణం గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించగా... వైఎస్సార్‌సీపీ సర్కారు వచ్చాక పూర్తి చేసింది. సుమారు 700 మంది లబ్ధిదారులకు గృహాలను అందజేశారు. సుమారు రూ.30 కోట్ల వ్యయంతో మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. ప్రధాన రోడ్డు నుంచి టిడ్కో గృహ సముదాయం వరకు మధ్యలో హైలెవల్ బ్రిడ్జి సహా సీసీరోడ్డు నిర్మాణం, నీళ్ల ట్యాంకు, డ్రైన్లు, విద్యుత్ సరఫరా కోసం ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు, సబ్‌స్టేషన్ నిర్మాణం చేశారు. ప్రస్తుతం వాటిలో 300 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్మించిన వాటర్ ట్యాంకు పుణ్యమా అంటూ నివాసితులకు తాగునీరు లభిస్తోంది. రోడ్లకు ఇరువైపులా ఉన్న స్తంభాలకు ఏర్పాటు చేసిన వీధిలైట్లు వర్షాలు, హైఓల్టేజ్ కారణంగా దెబ్బతిన్నాయి. మళ్లీ ఏర్పాటు చేసేవారే లేకుండాపోయారు. చిమ్మచీకటిలోనే ప్రజలు రాకపోకలు సాగించాల్సి వస్తోంది. పిచ్చి కంప చెట్లు భారీగా పెరగడంతో పెద్ద పాములు రాత్రి సమయాల్లో రోడ్లపై తిరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. మహిళలు, పిల్లలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. పట్టణంలో పనులు పూర్తి చేసుకొని రాత్రి ఎనిమిది గంటల తర్వాత టిడ్కో గృహాలకు మహిళలు రావాలంటే భయపడాల్సి వస్తోంది. వీధి దీపాలు లేక పోవటంతో మెయిన్ రోడ్డులో కొంతమంది యువకులు గంజాయి తాగుతూ, మరికొందరు మద్యం మత్తులో సంచరిస్తున్నారని మహిళలు వాపోతున్నారు. వెంటనే వీధి దీపాలు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.
జగనన్న కాలనీపైనా అదే నిర్లక్ష్యం
ప్రస్తుత కూటమి ప్రభుత్వం జగనన్న కాలనీపై సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తోంది. కనీస వసతులు కల్పించేందుకు ఏడాదిన్నరగా రూపాయి కూడా ఖర్చు చేయలేదు. గత ప్రభుత్వం టిడ్కో సముదాయం పక్కన ఈ కాలనీ ఏర్పాటు చేసి పురపాలక పరిధిలోని సుమారు 600 మందికి పట్టాలు అందజేసింది. వాటిలో కొంతమంది ఇప్పటికే ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. మరికొంతమంది ఇప్పుడిప్పుడే ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇక్కడ రోడ్లు లేవు. డ్రైనేజీ వ్యవస్థ నిర్మించలేదు. వీధి దీపాలు, తాగునీటి ఊసే లేదు. తాగునీటి కోసం తామంతా బయటకు వచ్చి మినరల్ వాటర్ తెచ్చుకోవాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. వర్షం పడితే రెండు మూడు అడుగుల లోతు నీటిలో రాకపోకలు సాగించాల్సి వస్తోందని వాపోతున్నారు.
త్వరలో వీధిదీపాల ఏర్పాటు
మున్సిపల్ కమిషనర్ ఎం.జస్వంతరావు, డీఈ రఫీక్‌లను వివరణ కోరగా.. టిడ్కో గృహాల మధ్య పెరిగిన పిచ్చిచెట్లు తొలగింపు, డ్రైనేజీలను శుభ్రం చేసే పనులు ప్రారంభించామన్నారు. మొత్తం 80 వీధి దీపాలు ఉండగా.. వాటిలో 40కుపైగా పనిచేయడం లేదన్నారు. వాటిలో 20 నూతన లైట్లు బిగించామన్నారు. మరికొన్ని లైట్ల కోసం రూ.5 లక్షలతో టెండర్లు పిలిచామని, మిగతావి త్వరలో ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. జగనన్న కాలనీని హౌసింగ్ అధికారులు పర్యవేక్షిస్తున్నారని, పుర పాలక సంఘానికి అప్పగించలేదని తెలిపారు.
టిడ్కో సముదాయం వద్ద డ్రైనేజీలో పిచ్చి మొక్కలు

స్థానిక చిలకలూరిపేట రోడ్డులో 1,503 గృహాలతో నిర్మించిన ట