
ఫణిదంలో దారుణం
కుటుంబాన్ని బలిగొన్న రుణలావాదేవీలు ఈనెల 17న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్మరణానికి యత్నం బావిలో దూకి అదేరోజు భార్య, కుమారుడు మృత్యువాత పురుగుల మందు తాగిన ఇంటి యజమాని మృత్యువుతో పోరాడుతూ శుక్రవారం రాత్రి మృతి
సత్తెనపల్లి: అప్పు తిరిగి చెల్లించే విషయంలో జరిగిన వివాదంలో అప్పు తీసుకున్న వ్యక్తి పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడంతో.. ఆ వివాదానికి కారణం తామేనని చెబుతాడనే ఆలోచనలతో రుణదాత కుటుంబం ఆత్మహత్యకు యత్నించడం అందులో తల్లీ కుమారులు నేలబావిలో దూకి చనిపోవడం, రుణదాత పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేయడం.. ఈనెల 17న సత్తెనపల్లి మండలం ఫణిదం గ్రామంలో జరిగిన ఈ సంఘటన జిల్లాలో సంచలనంగా మారిన విషయం పాఠక విధితమే. అయితే పురుగుమందు తాగి చికిత్సపొందుతూ రుణదాత సైతం చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు.
గ్రామంలో విషాద ఛాయలు
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రోజుల వ్యవధిలోనే మృత్యువాత పడటంతో ఫణిదం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తమ కుటుంబం మొత్తం దూరమవ్వడంతో శ్రీనివాసరావు కుమార్తె వెంకట జ్యోతి గుండెలవిసేలా రోదిస్తోంది. ఆమె రోదన చూపరులను సైతం కంటతడికి గురి చేస్తోంది. శ్రీనివాసరావు మృతదేహానికి సత్తెనపల్లి ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో శనివారం పోస్ట్‌మార్టం నిర్వహించారు. సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.