
కూటమి ప్రైవేటీకరణ విధానాలను అడ్డుకుంటాం
●ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కాపాడుకుంటాం
●సోషల్ యాక్టివిస్టుల ప్రకటన
నరసరావుపేట: ౖవెఎస్సార్‌సీపీ ఇచ్చిన పిలుపు మేరకు పిడుగురాళ్లలోని మెడికల్ కళాశాలను గాంధీ స్మారక సమితి వ్యవస్థాపకులు ఈదర గోపీచంద్, ఇంగ్లిష్ మీడియం పరిరక్షణ వేదిక కన్వీనర్ డి.ఏడుకొండలు శుక్రవారం సందర్శించారు. ఈ మేరకు ఫొటోలు, వివరాలను మీడియాకు వారు శనివారం విడుదల చేశారు. నాలుగు చోట్ల ఉన్న పోలీస్ చెక్‌పోస్టులను చాకచక్యంగా దాటి, హైవే పక్కన ఉన్న మెడికల్ కాలేజీ ముందుకు వెళ్లి సెల్ఫీ దిగామన్నారు. పేద ప్రజలు, పేద వైద్యవిద్యార్థుల మీద వాత్సల్యంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రాత్మకంగా తీసుకొచ్చిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మే దుశ్చర్యను కూటమి ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలియచేశామన్నారు. పలువురు నిరసనకారులను అక్కడి పోలీసులు కళాశాలలోకి వెళ్లకుండా అడ్డుకొని చెదరగొట్టటమే కాక, వెంటబడి పట్టుకుని వ్యాన్ ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారన్నారు. ప్రభుత్వ దౌర్జన్యాన్ని ఖండించారు. మెడికల్ కళాశాల ఆవరణలోకి వెళ్లి జగన్ చేయించిన అద్భుత నిర్మాణాన్ని వివరిస్తున్న వైఎస్సార్‌సీపీ యువనేత నాగార్జున యాదవ్‌పైన, అమరావతిలో శాసనమండలి సభ్యుల నిరసన ప్రదర్శనను కవర్ చేస్తున్న సాక్షి మీడియా ఇన్‌పుట్ ఎడిటర్‌పై పోలీసులు దౌర్జన్యం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజల నిరసనను కూటమి ప్రభుత్వం ఎంతోకాలం అణచలేదని తెలిపారు. వీటికి భయపడకుండా, మరిన్ని పోరాటాలలో పాల్గొంటామని వారు స్పష్టం చేశారు.