
హెల్త్ ఆన్ వీల్స్ రైలులో రెండవ విడత వైద్య పరీక్షలు
లక్ష్మీపురం: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణను దృష్టిలో పెట్టుకుని రెండవ విడత హెల్త్ ఆన్ వీల్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించినట్లు పీఆర్వో డి.వినయ్‌కాంత్ తెలిపారు. శనివారం గుంటూరు–దొనకొండ రైల్వే స్టేషన్ల మార్గంలో ఉద్యోగులకు రెండవ విడత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వినయ్‌కాంత్ మాట్లాడుతూ ఈనెల 13న కార్యక్రమాన్ని డీఆర్‌ఎం సుధేష్ఠ సేన్ ప్రారంభించినట్లు తెలిపారు. మొదటి రోజు గుంటూరు– రేపల్లె మార్గంలో నిర్వహించినట్లు పేర్కొన్నారు. మొబైల్ మెడికల్ యూనిట్‌లో గుంటూరు చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సీహెచ్. శ్రీనివాసు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వి.సింధు, లలిత, ఒమేగా హాస్పిటల్స్‌తో పాటు శంకర్ కంటి ఆసుపత్రి వైద్యులు కలిసి పరీక్షలు నిర్వహించారని తెలిపారు. రైల్వే ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించారని తెలియజేశారు. డీఎంఓ గుంటూరు డాక్టర్ ప్రియాంక, డీఎంఓ దొనకొండ డాక్టర్ ప్రకాశ్ పాల్గొన్నారు.