
మాజీ ఎమ్మెల్యే కాసును అడ్డుకున్న పోలీసులు
దాచేపల్లి: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ శుక్రవారం నిర్వహించతలపెట్టిన ‘చలో పిడుగురాళ్ల మెడికల్ కళాశాల’ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి వస్తున్న గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డిని దాచేపల్లి సీఐ భాస్కర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాలగూడ వద్ద అడ్డుకున్నారు. మిర్యాలగూడ సమీపంలో మహేష్‌రెడ్డి కారును ఆపిన పోలీసులు నిరసన కార్యక్రమానికి వెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేశారు. శాంతియుతంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తాను వెళ్లాల్సిందేనని మహేష్‌రెడ్డి పట్టుబట్టారు. పోలీసులు ససేమిరా అన్నారు. మహేష్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలియడంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు వివిధ మార్గాల ద్వారా భారీ సంఖ్యలో మిర్యాలగూడ చేరుకున్నారు. ఒక దశలో కార్యకర్తలతో కలసి నడుచుకుంటూ మెడికల్ కళాశాల వద్దకు వెళ్లేందుకు కాసు ప్రయత్నించారు. సుమారుగా 60 మంది పోలీసులు మహేష్‌రెడ్డిని చుట్టుముట్టారు. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. ప్రతి ఒక్కరూ మెడికల్ కళాశాల వద్దకు వెళ్లి సెల్ఫీ ఛాలెంజ్ ద్వారా ప్రభుత్వానికి సవాలు విసరాలని మహేష్‌రెడ్డి పిలుపునిచ్చారు. అనంతరం కాసును అదుపులోకి తీసుకోని బలవంతంగా కారులో ఎక్కించారు. మిర్యాలగూడ నుంచి హాలియా, నాగార్జునసాగర్ మీదుగా నరసరావుపేట తరలించారు. పోలీసుల తీరు పట్ల మహేష్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన జరుగుతున్న ఈ ఉద్యమానికి పోలీసులు ఆటంకాల సృష్టించడం పట్ల ఆయన మండిపడ్డారు.
పొందుగుల చెక్‌పోస్టు వద్ద భారీ బందోబస్తు
రాష్ట్ర సరిహద్దు పొందుగుల చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అద్దంకి–నార్కెట్‌పల్లి హైవేపై బారికేడ్లు పెట్టి ప్రతి వాహనాన్ని ఆపి క్షుణ్ణంగా పరిశీలించారు. నగర పంచాయతీలో ఉన్న వైఎస్సార్ సీపీ నేతలతోపాటు మండలంలో ఉన్న నాయకుల కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ మండల, పట్టణ కన్వీనర్లు కోటా కృష్ణ, షేక్ సుభాని, నగర పంచాయతీ చైర్మన్ కొప్పుల సాంబయ్య, ఎంపీపీ కందుల జాను, జెడ్పీటీసీ సభ్యుడు మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డి, వైస్ ఎంపీపీ తండా అబ్దుల్ సత్తార్, వైస్ చైర్మన్లు కొమెరాబత్తిన విజయకుమార్, షేక్ ఖాదర్ బాషా, అధికార ప్రతినిధి షేక్ జాకీర్ హుస్సేన్, నాయకులు కుందూరు తిరుపతిరెడ్డి, జక్కా అశోక్, మునగా శ్రీనివాసరావు, పరిమి బాబు, షేక్ ఇమామ్ వలి, గాదె రామకృష్ణారెడ్డి, జంగాల సింగర్ యాదవ్, మేడతి నరసింహారావు, బొమ్మిరెడ్డి నరసింహారావు, మోమిన్ నాగుల్, మీరా, ముత్యం చెన్నారెడ్డి, అకూరి వీరారెడ్డి, ముడి విక్టర్ పాల్, ఎన్.అనిల్, మందపాటి వీరారెడ్డి, కొండా నాయక్, సైదారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే కాసును అడ్డుకున్న పోలీసులు