
నాగభూషణ్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
మాచవరం/పిడుగురాళ్లరూరల్: ఆంధ్రప్రదేశ్ అంధకారంగా మారిందని, విద్య కోసం పక్క రాష్ట్రాలకు పోయే పరిస్థితి చంద్రబాబు వలన వచ్చిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర వైద్యుల విభాగం సంయుక్త కార్యదర్శి గజ్జల నాగభూషణ్‌రెడ్డి అన్నారు. చలో మెడికల్ కాలేజీలో భాగంగా కామేపల్లి గ్రామంలో ఉన్న మెడికల్ కళాశాలను శుక్రవారం ఆయన సందర్శించారు. అనంతరం మెడికల్ కళాశాల ప్రాంగణంలోకి వెళ్లి సెల్ఫీ దిగారు. మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో పూర్తి అయిన మెడికల్ కాలేజీని చూపించేందుకు లోపలకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఆయన మాట్లాడుతూ పల్నాడు జిల్లాకు మణిహారంగా పిడుగురాళ్ల దగ్గరలో మెడికల్ కాలేజీని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్మిస్తే చంద్రబాబునాయుడు ప్రభుత్వం నిధులు లేవనే సాకుతో ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తుందన్నారు. ఏడాదిన్నర అవుతున్నా నిర్మాణం శూన్యమన్నారు. రాబోయే రోజుల్లో ప్రైవేటు కాలేజీలు వస్తే పేద విద్యార్థులకు మెడికల్ విద్య అందదని, యాజమాన్యం ఫీజుల రూపంలో దోచుకుంటారని ఆయన అన్నారు. ప్రభుత్వ కాలేజీలు వస్తే రాష్ట్రంలో సీట్లు పెరుగుతాయని అన్నారు. ప్రైవేటీకరణను ఆపేదుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆనంతరం ఆయన సెల్ఫీ దిగి లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.