చిలకలూరిపేట: రాష్ట్రంలో ప్రజావ్యతిరేక నిరంకుశ పాలన కొనసాగుతోందని... ఎన్ని నిర్బంధాలు విధించినా ప్రజల గొంతుకగా మారి, ప్రజల పక్షాన పోరాడుతామని మాజీ మంత్రి విడదల రజిని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహనరెడ్డి పిలుపు మేరకు పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం శుక్రవారం చేపట్టారు. పిడుగురాళ్లలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా మాజీ మంత్రి విడదల రజిని నివాసం వద్ద పట్టణ పోలీసులు గురువారం రాత్రి నుంచే పహారా ఏర్పాటు చేశారు. శుక్రవారం చలో మెడికల్ కాలేజ్ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరిన మాజీ మంత్రిని అర్బన్ సీఐ పి రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. రజిని మాట్లాడుతూ ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీల నిర్వహణ జరిగితే ప్రజలకు మేలు జరుగుతుందని, ఏ ప్రాంతంలో ఏ కాలేజి నిర్మాణం జరిగిందో అక్కడ శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టేందుకు వెళుతుంటే అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. బాధ్యతగల ప్రతిపక్షంగా ప్రజల సమస్యలపై పోరాడే అధికారం తమకు ఉందని పేర్కొన్నారు. అయినప్పటికీ పోలీసులు అనుమతించకుండా గృహ నిర్బంధం విధించారు.
ప్రతి జిల్లాకు ఓ మెడికల్ కళాశాల
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహనరెడ్డి పరిపాలన కాలంలో 17 మెడికల్ కాలేజిలను అనుమతులు తెచ్చి రూ.8,500 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. మొదటి విడతగా ఐదు కళాశాలలను పూర్తిచేసి తరగతులను ప్రారంభించినట్లు వివరించారు. రెండో విడతగా మరో ఐదు మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. మూడో విడతగా ఏడు మెడికల్ కాలేజీలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కళాశాలల ద్వారా పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుతుందని చెప్పారు. పేదల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి లేని కూటమి ప్రభుత్వం ఈ కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటుకు ధారాదత్తం చేసేందుకు కుయుక్తులు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటుకు అప్పగించి జేబులు నింపుకొనే కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ ప్రజల పక్షాన పోరాడుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కందుల శ్రీకాంత్, నియోజకవర్గ అధ్యక్షుడు కుప్పాల ప్రభుదాస్, పార్టీ పట్టణ, చిలకలూరిపేట, నాదెండ్ల, యడ్లపాడు మండలాల అధ్యక్షులు షేక్ దరియావలి, దేవినేని శంకరరావు, మంగు ఏడుకొండలు, వడ్డేపల్లి నరసింహారావు, పార్టీ వివిధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి విడదల రజిని
చలో మెడికల్ కాలేజీకు హాజరుకాకుండా హౌస్ అరెస్ట్