
ప్రజాస్వామ్యానికి విఘాతం
పిడుగురాళ్ల: పిడుగురాళ్లలో ప్రాజాస్వామ్యానికి విఘాతం కలిగిదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జునయాదవ్ అన్నారు. పిడుగురాళ్ల పట్టణ సమీపంలోని కామేపల్లి గ్రామం వద్ద నిర్మిస్తున్న డాక్టర్ వైఎస్సార్ వైద్య కళాశాల, వైద్యశాలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో చలో మెడికల్ కాలేజీ శుక్రవారం నిర్వహించారు. పోలీసుల ఆంక్షలను లెక్క చేయక మెడికల్ కాలేజీ వద్దకు చేరుకోని కాలేజీ, వైద్యశాల భవనాలను పరిశీలించారు. పిడుగురాళ్ల పట్టణ సీఐ శ్రీరాం వవెంకట్రావు అక్కడకు చేరుకోని నాగార్జున యాదవ్‌ను అరెస్టు చేసి పిడుగురాళ్ల పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం విడుదల చేశారు. అనంతరం స్టేషన్ వద్ద నాగార్జునయాదవ్ మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నాడా.. మూర్ఖపు మంత్రి ఉన్నాడా అని ప్రశ్నించారు. మెడికల్ కళాశాల వద్దకు వెళితే ప్రస్తుతం మాటలతో చెప్పాం, మరోసారి చేతలతో చెప్పాల్సి వస్తుందని స్వయాన జిల్లా ఎస్పీ చెప్పడం రాష్ట్రంలో పరిస్థితికి అద్దం పడుతుందన్నారు. జిల్లా ఎస్పీ కృష్ణారావు, పిడుగురాళ్ల సీఐ శ్రీరాం వెంకట్రావులు తమ ఉద్యోగ ధర్మాన్ని బాగా నిర్వర్తించారని వ్యంగ్యంగా విమర్శించారు.
పేదలకు వైద్యం, విద్యార్థులకు వైద్య విద్య అందాలని సుమారు రూ.600 కోట్లతో పెద్దఎత్తున మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తే, దాన్ని నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలుకు అమ్మేందుకు చంద్రబాబునాయుడు, నారా లోకేష్ సిద్ధమయ్యారని విమర్శించారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పారు. అక్రమ అరెస్టులు ఉద్యమాన్ని ఆపలేవని అన్నారు. ఉదయం నుంచి కనీసం తాగటానికి నీళ్లు కూడా ఇవ్వలేదని అన్నారు. ఎస్పీ కృష్ణారావు చర్యలకు చంద్రబాబునాయుడు వద్ద మంచి మార్కులు ఉంటాయి... మీరు పడిన కష్టానికి భవిష్యత్‌లో చాలా మంచి గిఫ్టులు ఉంటాయని పరోక్షంగా హెచ్చరించారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జునయాదవ్
వైద్య కళాశాలను సందర్శించిన యాదవ్
అరెస్టు చేసి స్టేషన్‌నకు తరలింపు