
చంద్రబాబు డైవర్షన్ రాజకీయం చేస్తున్నారు..
వినుకొండ: రాష్ట్ర ప్రజల సమస్యలపై పోరాటానికి వెళ్తుంటే అడ్డుకోవడం ఏమిటని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరెస్టులు మంచివి కావని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మించిన మెడికల్ కళాశాలల వద్ద నిరసన కార్యక్రమానికి వెళుతున్న మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు గురువారం రాత్రి పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయం విదితమే. శుక్రవారం తెల్లవారుజాము నుంచి పోలీసులు ఆయనను గృహ నిర్బంధం చేశారు. బొల్లా మీడియాతో మాట్లాడుతూ సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు జగనన్న సృష్టించిన సంపదను ఎందుకు అమ్ముకుంటున్నారని ప్రశ్నించారు. 2029లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడం ఖాయమని, అధికారంలోకి వచ్చిన వెంటనే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఒప్పందాన్ని రద్దు చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చూపిస్తూ గత ప్రభుత్వం హయాంలో వందల కోట్ల అభివృద్ధి పనులను ఎక్కడ చేశారంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలియజేసేందుకు మేము వెళుతుంటే అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. పోలవరం, అమరావతి, వరికపుడిశెలతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం చేతకాక తమ ప్రభుత్వం హయాంలో నిర్మించిన మెడికల్ కళాశాలలు ప్రైవేటు పరం చేస్తామని చంద్రబబాబు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అధికారం శాశ్వతం కాదని ప్రజలు అంతా గమనిస్తున్నారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో సరైన రీతిలో బుద్ధి చెబుతామని అన్నారు. పేదలకు వైద్యం అందించేందకు, ఏర్పాటు చేసిన కళాశాలలు ప్రైవేటు పరం చేస్తే చూస్తూ ఊరుకోబోమని ప్రజల తరఫున పోరాటం చేస్తామన్నారు.
మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు
చలో పిడుగురాళ్ల మెడికల్ కళాశాల కార్యక్రమానికి వెళుతున్న నాయకులను అడ్డుకోవడంపై మండిపాటు