
డాక్టర్ గోపిరెడ్డిని అడ్డుకున్న పోలీసులు
నరసరావుపేట: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో చేపట్టిన చలో పిడుగురాళ్ల మెడికల్ కళాశాల కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి గురువారం రాత్రే హౌస్ అరెస్టుచేస్తూ నోటీసులు అందజేశారు. కార్యాలయం ముందు పోలీసులు కాపలాగా ఉన్నారు. అయినప్పటికీ శుక్రవారం ఉదయం నాయకులు, కార్యకర్తలతో కలిసి బయలుదేరేందుకు పార్టీ కార్యాలయం నుంచి బయటకురాగానే సీఐ హైమారావు తన సిబ్బందితో వారిని వారించారు. తమకు సహకరించాలని కోరారు. దీంతో రోడ్డుపై నిలబడి మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని, డౌన్‌డౌన్ చంద్రబాబు, పవన్ కల్యాణ్, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం వర్దిల్లాలి అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. రైతు విభాగ జిల్లా అధ్యక్షులు అన్నెం పున్నారెడ్డి, నాయకులు పొనుగోటి వెంకటరావు, పచ్చవ రవీంద్రబాబు, కురుగుంట్ల శ్రీనివాసరెడ్డి, తన్నీరు శ్రీనివాసరావు, అన్నా మోహన్, గంటెనపాటి గాబ్రియేలు, హెల్డా ప్లారెన్స్, గోగుల మనోహరయాదవ్, కొత్తూరి కిషోర్‌బాబు పాల్గొన్నారు.
నిరసన వ్యక్తంచేసిన డాక్టర్ గోపిరెడ్డి,
నాయకులు