
టీడీపీ గ్రూపు విభేదాలతో నిలిచిన యూరియా పంపిణీ
చాగంటివారిపాలెం(ముప్పాళ్ల): మండలంలోని చాగంటివారిపాలెం గ్రామంలో అధికార తెలుగుదేశం పార్టీ నేతల మధ్య విభేదాలతో గురువారం యూరియా పంపిణీ నిలిచిపోయింది. రైతులకు యూరియా కట్టలు అందించేందుకుగాను వ్యవసాయశాఖ అధికారులు 200 మందు కట్టలను గ్రామ సచివాలయంలో దింపారు. ఆ మేరకు మందు కట్టలు పంపిణీ చేసేందుకుగాను బుధవారం గ్రామంలో టీడీపీలోని ఒక గ్రూపు నాయకులు టోకెన్‌ల పంపిణీ చేపట్టారు. ఒక్కొక్క రైతుకు ఒక యూరియా, ఒక డీఏపీ కట్ట చొప్పున మొత్తం 100 మందికి టోకెన్‌లు అందించారు. మరో గ్రూపునకు చెందిన వారు తమకు ప్రాధాన్యం లేకుండా పోయిందని టీడీపీ మండల స్థాయి నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. టోకెన్‌లు అందరికీ సమానంగా అందించాల్సిందేనని పట్టుబట్టారు. వ్యవసాయశాఖ అధికారులు గురువారం టోకెన్‌లు ఇచ్చిన వారికి మందు కట్టలు పంచేందుకు సిద్ధమవుతుండగా టీడీపీలోని ఒక గ్రూపు వారు సచివాలయం వద్దకు వచ్చి టోకెన్‌ల పంపిణీ ఎలా చేపట్టారంటూ వాదనకు దిగారు. ఇంత మంది రైతులుంటే కేవలం వంద మందికే, అందులోను ఒక గ్రూపు వారికే టోకెన్‌లు ఎలా ఇస్తారని, అందరకీ ఇవ్వాల్సిందేనంటూ భీష్మించుకుకూర్చున్నారు. కొద్దిసేపు ఇరు గ్రూపు వారు వాదనలతో గందరగోళ పరిస్థితి నెలకొంది. వ్యవసాయశాఖ అధికారులు రెండు గ్రూపుల వారికి నచ్చచెప్పలేక పంపిణీని తాత్కాలికంగా వాయిదా వేసుకొని వెళ్లిపోయారు. యూరియా కోసం పడిగాపులు కాసిన రైతులు తెలుగుదేశం పార్టీ నేతల తీరుతో యూరియా తీసుకోకుండానే వెనుతిరిగారు.