
సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె తప్పదు
కలెక్టర్‌కు ముందస్తు నోటీసు అందజేసిన జేఏసీ నాయకులు
నరసరావుపేట: సచివాలయ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే నిరసన కార్యక్రమాలు చేపట్టే పరిస్థితి వస్తుందని పల్నాడు జిల్లా విలేజ్, వార్డు సచివాలయ ఉద్యోగ జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కృతిక శుక్లాకు తమ సమస్యలపై ముందస్తు సమ్మె నోటీసు సమర్పించారు. విద్యార్హతలకు అనుగుణంగా విధులు అప్పగించాలని, ఇంటింటి సర్వేల నుంచి విముక్తి కలిగించాలని, ఉద్యోగులను వారి మాతృశాఖలకు బదిలీ చేయాలని, ఆదివారాలు, పండుగలు, సెలవుదినాల్లో బలవంతపు విధులు ఆపాలని, నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరుచేసి ప్రత్యేక ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, రికార్డు అసిస్టెంట్ కేడర్‌ను జూనియర్ అసిస్టెంట్ కేడర్‌గా మార్చాలని, స్టేషన్ సీనియారిటీ ఆధారంగా పారదర్శక బదిలీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే 15రోజుల్లో సమస్యలు పరిష్కరించకపోతే, ఏపీ విలేజ్, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో జేఏసీ నాయకులు కొమ్మాలపాటి ప్రతాపకుమార్, చెన్నయ్య, కరిముల్లా, మేడా నాగేశ్వరరావు, ఆంజనేయులు, జయలక్ష్మి, చింతా ఆంజనేయులు, ఆనందకుమార్, సాంబశివరావు ఉన్నారు.