
జాబ్ మేళాలో 66 మంది ఉద్యోగాలకు ఎంపిక
సత్తెనపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం నిర్వహించిన ఉద్యోగ మేళాలో 66 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. పల్నాడు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఈ.తమ్మాజిరావు మాట్లాడుతూ ఉద్యోగ మేళాకు 175 మంది నిరుద్యోగ యువతీ, యువకులు హాజరు కాగా 10 కంపెనీల ప్రతినిధులు హాజరై 66 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారన్నారు ఉద్యోగ మేళాకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కె.పద్మ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ వారు ఈ ఉద్యోగ మేళాను సత్తెనపల్లిలో నిర్వహించడం చాలా సంతోషకరమన్నారు. నియామక పత్రాలు అందుకున్న యువతకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ పల్నాడు జిల్లా ప్లేస్మెంట్ ఆఫీసర్ ఎం.రవీంద్రనాయక్, సత్తెనపల్లి స్కిల్ హబ్ కోఆర్డినేటర్ ఇందూరి రామకృష్ణారెడ్డి, సురేష్, రమ్య, కంపెనీ హెచ్‌ఆర్ ప్రతినిధులు, కళాశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.