
సహకార సంఘాల బలోపేతంతో ఆర్థిక సమానత్వం
●జిల్లా సహకార అధికారి ఎం.నాగరాజు
● జిల్లాలోని సహకార సంఘాల
చైర్పర్సన్లకు అవగాహన
నరసరావుపేట: దేశం మొత్తం ఒకే విధమైన సహకార విధానంతో బలమైన ఆర్థిక వ్యవస్థను తయారుచేసి సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వాన్ని రైతులు, పేదలకు అందించే ఉద్దేశంతో జాతీయ సహకార విధానం పాలసీని తీసుకొచ్చారని జిల్లా సహకార అధికారి ఎం.నాగరాజు పేర్కొన్నారు. బుధవారం జీడీసీసీ బ్యాంకు మీటింగ్ హాలులో జాతీయ సహకార విధానంపై జిల్లా సహకార సంఘాల చైర్పర్సన్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. సొసైటీలు గ్రామ, మండల స్థాయిలో నిర్వహించడానికి అనుకూలమైన వ్యాపార విషయాలపై అధ్యయనంచేసి, తద్వారా ఆర్థిక స్వావలంబన పెంపొందించేందుకు వ్యాపారానికి అనువైన విధానాలను రూపొందించాలని డివిజనల్ కో–ఆపరేటివ్ ఆఫీసర్ కె.తిరుపతయ్య సూచించారు. సబ్ డివిజనల్ కో–ఆపరేటివ్ అధికారి స్వర్ణ చినరామిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సహకార సంఘాల నేషనల్ డ్రాఫ్టింగ్ కమిటీని మాజీ కేంద్రమంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు అధ్యక్షతన ఏర్పాటు చేసిందన్నారు. రైతులు, సహకార వాదులు, సొసైటీ అధ్యక్షులు చేసే సూచనలను ఆ కమిటీకి అందించనున్నామన్నారు. క్రోసూరు సొసైటీ అధ్యక్షుడు కడియం శివనాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులకు ఎరువులు ఇబ్బంది లేకుండా ఉండటానికి ప్రభుత్వం సహకార సంఘాల ద్వారానే పంపిణీ చేయాలని, ఎరువులు మంజూరు ఆలస్యం అవుతున్నందున రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు.
● గుడిపాడు, గార్లపాడు, ముప్పాళ్ల, అనుపాలెం, మాదల తదితర సొసైటీ అధ్యక్షులు మాట్లాడారు. రైతులు, సహకార సంఘాల సభ్యులు, త్రిసభ్య కమిటీలోని సభ్యులు అందరూ ఇచ్చే సలహాలు, సూచనలను తప్పనిసరిగా ప్రభుత్వానికి అందజేస్తామని జిల్లా సహకార అధికారి నాగరాజు పేర్కొన్నారు. గురజాల, సత్తెనపల్లి సబ్ డివిజనల్ అధికారులు షేక్ రహంతుల్లా, కె.అంజమ్మ, జూనియర్, సీనియర్ ఇనస్పెక్టర్లు రమేష్, స్వరూప, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.