
చికిత్స పొందుతూ మహిళ మృతి
ఇంజక్షన్ వికటించి చనిపోయిందని బంధువుల ఆరోపణ వైద్యులు, వైద్య సిబ్బంది పరారీతో తీవ్ర ఆగ్రహం నర్సింగ్ హోమ్ అద్దాలు పగలగొట్టిన ఆందోళనకారులు
పిడుగురాళ్ల: ఆస్పత్రికి వస్తే వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఇంజక్షన్ చేస్తుండగానే మహిళ మృతి చెందినట్లు ఆమె బంధువులు ఆరోపించారు. ఈ సంఘటన పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని విజయ నర్సింగ్ హోమ్‌లో ఆదివారం రాత్రి జరిగింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల మేరకు.. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం పెద్ద నెమలిపురి గ్రామానికి చెందిన అంకాల భూలక్ష్మి (33) మూడు రోజుల క్రితం తన ఇంట్లో దుస్తులు ఉతుకుతుండగా తెలియని విషపు పురుగు కుట్టింది. మొదటగా పిడుగురాళ్లలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ చికిత్స అనంతరం తిరిగి ఇంటికి తీసుకెళ్లారు. మళ్లీ తలనొప్పిగా ఉందని చెప్పడంతో పిడుగురాళ్లలోనే విజయ నర్సింగ్ హోమ్‌కి తీసుకొచ్చారు. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు ఆమె కాస్త ఆరోగ్యంగానే ఉంది. కాంపౌండర్ ఇంజక్షన్ ఇస్తున్న సమయంలో ఎగశ్వాసతో అకస్మాత్తుగా మృతి చెందిందని, ఇది పూర్తిగా వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని భూలక్ష్మి బంధువులు ఆరోపిస్తున్నారు. కనీసం మృతి చెందిన విషయం కూడా తెలపకుండా డాక్టర్‌తోపాటు వైద్య సిబ్బంది పారిపోవడంతో కోపోద్రిక్తులైన బంధువులు ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేశారు. పిడుగురాళ్ల పట్టణ సీఐ శ్రీరామ్ వెంకట్రావు తన సిబ్బందితో నర్సింగ్ హోమ్ వద్దకు చేరుకున్నారు. ఆందోళనకు దిగిన మృతురాలి బంధువులకు సర్దిచెప్పారు.

చికిత్స పొందుతూ మహిళ మృతి

చికిత్స పొందుతూ మహిళ మృతి