
ఆలయ నిర్మాణానికి రూ.5,01,116 విరాళం
నరసరావుపేట రూరల్: ఇస్సపాలెం మహంకాళి అమ్మవారి దేవస్థానం నిర్మాణానికి నరసరావుపేటకు చెందిన వెంకట సాంబశివ జ్యూయలర్స్ అండ్ డైమండ్స్ అధినేత సాతులూరి శివకుమార్, లక్ష్మి దంపతులు రూ.5,01,116 విరాళంగా అందజేశారు. ఆలయంలో నిర్వహించిన కార్యక్రమంలో విరాళం మొత్తాన్ని ఈఓ నలబోతు మాధవిదేవికి దాతలు అందజేశారు. కార్యక్రమానికి దాతలు కుమారులు సంతోష్, చైతన్య శంకర నారాయణ, కోడలు గాయత్రీ హాజరయ్యారు. ఆలయ నిర్మాణానికి దాతలు విరాళాలు అందజేసి సహకరించాలని ఈఓ కోరారు. ఆలయ అర్చకులు కొత్తలంక కార్తికేయ శర్మ, నండూరి కాళికృష్ణ పాల్గొన్నారు.
ఫుట్‌బాల్, సెపక్ తక్రా
జిల్లా జట్ల ఎంపిక వాయిదా
సత్తెనపల్లి: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో ఈనెల 15న జరగాల్సిన అండర్–19 స్కూల్ గేమ్స్ ఫుట్‌బాల్, సెపక్‌తక్రా బాల,బాలికల జిల్లా జట్ల ఎంపికలు అకాల వర్షాల కారణంగా వాయిదా వేస్తున్నట్లు అండర్–19 స్కూల్ గేమ్స్ కార్యదర్శి జి.నరసింహారావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తదుపరి ఎంపికల తేదీలను త్వరలో ప్రకటి స్తామన్నారు. ఆయనతో పాటు నిర్వాహకుడు విద్యాకేంద్రం జూనియర్ కాలేజీ ఫీజికల్ డైరెక్టర్ పి. శివరామకృష్ణ ఉన్నారు.
జాతీయ రహదారిపై లారీలో మంటలు
దాదాపు రూ.10 లక్షల ఆస్తి నష్టం
యడ్లపాడు: జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న అశోక్ లేలాండ్ మినీ లారీ అగ్ని ప్రమాదానికి గురై పాక్షికంగా దగ్ధమైంది. ఈ ఘటనలో దాదాపు రూ.10 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. సమయానికి అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది, మంటలు పెద్దగా వ్యాపించకుండా వేస్ట్ కాటన్ లోడును కాపాడగలిగారు. చిలకలూరిపేట నుంచి గుంటూరు వైపు వేస్ట్ కాటన్ లోడుతో వెళ్తున్న లారీ శనివారం అర్ధరాత్రి దాటాక 2.35 గంటల సమయంలో మండలంలోని వంకాయలపాడు సమీపంలోకి చేరుకుంది. ఇంతలో ఒక్కసారిగా ఇంజిన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా లారీలో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున వ్యాపించాయి. లారీ డ్రైవర్ కిందకు దూకడంతో ప్రాణనష్టం తప్పింది. చిలకలూరిపేట అగ్నిమాపక సిబ్బంది సంఘటనా దాదాపు గంట పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే లారీ ఇంజిన్ భాగం పూర్తిగా కాలిపోయింది. ఈ సందర్భంగా చిలకలూరిపేట స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఎన్ కిరణ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ బ్యాటరీల నుంచి షార్ట్ సర్క్యూట్ జరగడం వల్లే ప్రమాదం సంభవించిందని తెలిపారు. మంటలకు ఆహుతి కాకుండా దాదాపు రూ.10 లక్షల విలువైన వేస్ట్ కాటన్‌ను రక్షించగలిగామని ఆయన పేర్కొన్నారు. ఫైర్ సిబ్బంది ఆర్ మాణిక్యరావు, కె.పవన్‌కుమార్, ఇ.ప్రభాకరరెడ్డి, కె.నరసరాజు పాల్గొన్నారు.
పశ్చిమ డెల్టాకు 5,009 క్యూసెక్కులు విడుదల
దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్ నుంచి ఆదివారం 5,009 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజి వద్ద 12 అడుగులు నీటిమట్టం ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవెల్‌కి నీటి విడుదల నిలిపివేశారు. బ్యాంక్ కెనాల్‌కు 988 క్యూసెక్కులు, తూర్పు కాలువకు 342, పశ్చివ కాలువకు 131, నిజాపట్నం కాలువకు 297, కొమ్మూరు కాలువకు 1,483 క్యూసెక్కులు విడుదల చేశారు. బ్యారేజి నుంచి సముద్రంలోకి 2,57,250 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

ఆలయ నిర్మాణానికి రూ.5,01,116 విరాళం